Rajyasabha: రాజ్యసభలో హైడ్రామా.. పేపర్లు చించేసిన తృణమూల్‌ ఎంపీ!

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వరుసగా మూడో రోజూ హైడ్రామా కొనసాగింది. పెగాసస్‌, దేశంలోని పలు మీడియా సంస్థలపై ఐటీ దాడులు సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు

Updated : 22 Jul 2021 17:17 IST

దిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వరుసగా మూడో రోజూ హైడ్రామా కొనసాగింది. పెగాసస్‌, దేశంలోని పలు మీడియా సంస్థలపై ఐటీ దాడులు సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు గురువారం ఆందోళనకు దిగాయి. రాజ్యసభలో పెగాసస్ అంశంపై మాట్లాడేందుకు కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ లేచి నిలబడగానే తృణమూల్‌ ఎంపీ శంతను సేన్‌ ఆయన చేతిలో పేపర్లను లాక్కొని చింపేశారు. వాటిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ వైపు విసిరేశారు. దీంతో మంత్రి అశ్విని వైష్ణవ్‌ తన ప్రసంగాన్ని త్వరగా ముంగించాల్సి వచ్చింది. విపక్షాల ఆందోళనల నడుమ సభ రేపటికి వాయిదా పడింది.

రాజ్యసభ గురువారం ఒక్క రోజే మూడు సార్లు వాయిదా పడింది. మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు, అనంతరం 2 గంటల వరకు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమయ్యాక.. ఐటీ మంత్రి వైఖరిని ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా తప్పుపట్టారు. సభలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నడుమ మంత్రి ప్రకటన చేసిన విధానం చూస్తే ప్రభుత్వం ఈ సమస్యను అపహాస్యం చేయాలనుకుంటున్నట్లుగా ఉందంటూ ఆయన విమర్శించారు. నూతన వ్యవసాయ చట్టాలపై వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్‌, శిరోమణి ఆకాలీదళ్‌ ఎంపీలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మరోవైపు పెగాసస్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు.  మీడియా సంస్థలపై గురువారం జరిగిన ఐటీ దాడుల అంశాన్ని కాంగ్రెస్‌ ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌ లేవనెత్తారు. ఏ అంశంపై చర్చించాలన్నా ముందుగా తన అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని దిగ్విజయ్‌ సింగ్‌కు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రభుత్వం ప్రతి అంశంపై చర్చించడానికి సిద్ధంగా ఉందంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పినప్పటికీ విపక్షాలు తమ ఆందోళనను విరమించుకోలేదు. ఈ నేపథ్యంలో సభ మరోసారి వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని