China: పిల్లలకు బండెడు హోంవర్క్‌ వద్దు.. చైనాలో కొత్త చట్టం!

చైనాలోని జిన్‌పింగ్‌ సర్కారు భావితరాలను గాడిన పెట్టేందుకు కఠిన చట్టాలను అమల్లోకి తీసుకొస్తోంది. పిల్లల్లో క్రమశిక్షణ, దేశభక్తి నింపడమే లక్ష్యమని చెబుతూ వారి అలవాట్లపై ఒకరకంగా ఆంక్షలు విధిస్తోంది....

Published : 24 Oct 2021 01:20 IST

బీజింగ్‌ : చైనాలోని జిన్‌పింగ్‌ సర్కారు భావితరాలను గాడిన పెట్టేందుకు కఠిన చట్టాలను అమల్లోకి తీసుకొస్తోంది. పిల్లల్లో క్రమశిక్షణ, దేశభక్తి నింపడమే లక్ష్యమని చెబుతూ వారి అలవాట్లపై ఒకరకంగా ఆంక్షలు విధిస్తోంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ సమయాన్ని కుదించింది. అలాగే పిల్లల్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని గుర్తుచేస్తూ.. పిల్లలు తప్పు చేస్తే పెద్దలకు శిక్షలు విధించేలా చట్టాన్ని రూపొందించింది. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్‌ తీసుకొస్తున్న కొత్త చట్టాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది..!

హోంవర్క్‌, ట్యూషన్‌ ఒత్తిడి తగ్గించేలా..

తాజాగా పిల్లలపై ఒత్తిడి తగ్గించేందుకు గానూ.. హోంవర్క్‌, ట్యూషన్ల భారాన్ని తగ్గించే దిశగా మరో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు చైనా సన్నద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే నిబంధనలన అమలు చేసే బాధ్యత స్థానిక అధికార యంత్రాంగానికి అప్పగించాలని యోచిస్తోందట! అలాగే పిల్లలకు సరిపడా విశ్రాంతి లభించేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని మరోసారి ఈ చట్టం ద్వారా గుర్తుచేయనుందని సమాచారం. అలాగే పిల్లలు ఇంటర్నెట్‌ వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించనుందట! ఈ కొత్త చట్టం సత్ఫలితాలిచ్చే అవకాశం ఉన్నట్లు అక్కడి నిపుణులు భావిస్తున్నారు. వీటి వల్ల పిల్లలపై మానసిక ఒత్తిడి తగ్గి.. సృజనాత్మకత పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.   

ఆన్‌లైన్ వీడియో గేమ్స్‌పై..

పిల్లలు ఆన్‌లైన్‌లో ఆడే వీడియో గేమ్స్‌పై చైనా ఆంక్షలు విధించింది. 18 ఏళ్ల వయస్సులోపు వారు ఇకపై వారంలో మూడు గంటలు మాత్రమే ఆడుకొనేలా కొత్త విధివిధానాలు తీసుకొచ్చింది. సెప్టెంబర్‌ 1 నుంచి శుక్రవారాలు, వీకెండ్స్‌, ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు గేమ్స్‌ ఆడుకొనేలా అవకాశం కల్పిస్తున్నట్టు నేషనల్‌ ప్రెస్‌ అండ్‌ పబ్లికేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (NPPA) ఉత్తర్వులు జారీ చేసింది. వారంలో కేవలం మూడు గంటలకే పరిమితం చేస్తూ ఆంక్షలు విధించింది. ఈ కొత్త నిబంధనలతో చైనాలోని గేమింగ్‌ దిగ్గజం టెన్సెంట్‌తో పాటు అలీబాబా తదితర అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడింది. ఇలాంటి గేమ్‌లను చైనా ఓ మత్తుమందుగా భావిస్తోంది. దీర్ఘకాలంలో వ్యసనంగా మారితే పిల్లల చదువులు, వ్యవహార శైలిపై ప్రభావం పడే అవకాశం ఉందని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, గేమింగ్‌ కంపెనీలపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు నిబంధనల అమలును పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.

పిల్లలు తప్పు చేస్తే పెద్దలకు శిక్ష..

పిల్లలు తప్పుచేస్తే తల్లిదండ్రులను శిక్షించేలా చైనా ఇటీవలే కొత్తచట్టాన్ని సిద్ధం చేసింది. ‘ఫ్యామిలీ ఎడ్యుకేషన్‌ ప్రమోషన్‌ లా’ పేరుతో ఇప్పటికే ముసాయిదా బిల్లును రూపొందించింది. దీని ప్రకారం- పిల్లల ప్రవర్తన సరిగా లేకపోయినా, వారు నేరాలకు పాల్పడినా ముందుగా తల్లిదండ్రులకు సమాచారమిస్తారు. ఆ తర్వాత బిడ్డల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత కన్నవారిపైనే ఉంటుంది. అప్పటికీ పిల్లలు మారకపోతే, వారి తల్లిదండ్రులు పనిచేసే సంస్థలకు, లేదా యజమానులకు విషయం చేరవేస్తారు. తర్వాత తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమానికి వారు తప్పనిసరిగా హాజరుకావాలి. లేకుంటే 156 డాలర్ల (సుమారు రూ.11,600) జరిమానా, 5 రోజుల జైలు శిక్ష విధించే అవకాశముంటుంది. చిన్నారుల ప్రవర్తన సరిగ్గా లేకపోవడానికి చాలా కారణాలున్నా, వారి పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ చూపకపోవడమే ప్రధాన కారణమని చైనా చట్టసభ వ్యవహారాల కమిషన్‌ అధికార ప్రతినిధి జాంగ్‌ తైవే పేర్కొన్నారు.

ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిన తర్వాత చైనాలో స్వతంత్ర భావజాలం పెరిగిందని.. కమ్యూనిస్టు ప్రభుత్వ కఠిన చట్టాలపై ప్రజలు తిరగబడే అవకాశమున్న నేపథ్యంలో ఈ తరహా చట్టాలను తీసుకొస్తోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఇలా చట్టాల ద్వారా పౌరుల వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చడం ఏమాత్రం సరికాదని కొంతమంది సామాజిక మాధ్యమాల వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలపై ఆంక్షల వల్ల వారు వారి స్వేచ్ఛను కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇంటర్నెట్‌ వినియోగం వల్ల పిల్లలు పక్కదారి పడుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కమ్యూనిస్టు పార్టీని, దేశాన్ని, ప్రజలను, సామ్యవాదాన్ని ప్రేమించేలా తర్వాతి తరాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని