కేంద్రం.. రైతు సంఘాల చర్చలు ప్రారంభం

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతు సంఘాల నాయకులతో కేంద్ర ఏడో విడత చర్చలు సోమవారం ప్రారంభమయ్యాయి. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 40 రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు

Updated : 04 Jan 2021 15:56 IST

దిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతు సంఘాల నాయకులతో కేంద్ర ప్రభుత్వ ఏడో విడత చర్చలు సోమవారం ప్రారంభమయ్యాయి. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 40 రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌, సోమ్‌ ప్రకాశ్‌ సంప్రదింపులు జరుపుతున్నారు. చర్చల ప్రారంభానికి ముందు ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతలకు మంత్రులు, రైతు సంఘాల నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. 

గతేడాది డిసెంబరు 30న కేంద్రం, రైతుల మధ్య ఆరో విడత చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేవలం రెండు అంశాలపైనే ఇరు వర్గాల నడుమ ఏకాభిప్రాయం కుదిరింది. కొత్త సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీపై ఇంకా ప్రతిష్టంభన వీడలేదు. దీంతో నేటి సమావేశంలో ప్రధానంగా వీటిపైనే చర్చ జరగనుంది. చట్టాలను పూర్తిగా ఉపసంహరించి.. కనీస మద్దతు ధరపై లిఖితపూర్వ హామీ ఇవ్వాలని రైతులు పట్టుబడుతున్నారు. అయితే కేంద్రం మాత్రం ఇందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. 

చట్టాల్లోని అభ్యంతరాలపై అంశాల వారీగా చర్చిస్తామని, సమస్యకు సహేతుక పరిష్కారం చూపిస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నేటి చర్చలు ఫలప్రదం అవుతాయని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరోవైపు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేదిలేదని రైతులు ఘంటాపథంగా చెబుతున్నారు. నేటి చర్చలు విఫలమైతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేయాలని ఇప్పటికే అన్నదాతలు నిర్ణయించుకున్నారు. జనవరి 6, 26 తేదీల్లో దిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీ చేపడతామని హెచ్చరించాయి. 

మీ ఉద్యమ స్ఫూర్తికి సెల్యూట్‌: కేజ్రీవాల్‌

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన సాగిస్తున్న రైతులకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి మద్దతు ప్రకటించారు. ‘తీవ్రమైన చలి, వర్షాన్ని కూడా లెక్కచేయకుండా మీరు చేస్తున్న ఉద్యమానికి సెల్యూట్‌’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటికైనా కేంద్రం వెనక్కి తగ్గి రైతుల డిమాండ్లను అంగీకరించాలని, సాగు చట్టాలను రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

ఇవీ చదవండి..

చలికి వణికి.. వర్షంలో తడిసి

యంత్రం.. సాగు మంత్రం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని