Drugs Case: నా భర్త ప్రాణాలకు హాని ఉంది: సమీర్‌ వాంఖడే భార్య

ముంబయి క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఆర్యన్‌ఖాన్‌ విడుదలకు డబ్బులు డిమాండ్‌ చేశారంటూ ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై వచ్చిన ఆరోపణలపై ఆయన భార్య, నటి క్రాంతి రెడ్కర్‌......

Updated : 26 Oct 2021 16:51 IST

ముంబయి: ముంబయి క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఆర్యన్‌ఖాన్‌ విడుదలకు డబ్బులు డిమాండ్‌ చేశారంటూ ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై వచ్చిన ఆరోపణలపై ఆయన భార్య, మరాఠీ నటి క్రాంతి రెడ్కర్‌ స్పందించారు. సమీర్‌ నిజాయతీపరుడని, అందుకే ఆయనకు శత్రువులు ఉన్నారన్నారు. బాలీవుడ్‌ సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్‌ చేసి వారి నుంచి వాంఖడే డబ్బులు వసూలు చేసేవారంటూ మంత్రి నవాబ్‌ మాలిక్‌ చేసిన ఆరోపణల్ని ఆమె ఖండించారు. తన భర్త తప్పు చేయలేదని, ఇలాంటి నిందలను తాము సహించబోమన్నారు. తన భర్తపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభాకర్‌ సాయిల్‌ అనే ప్రత్యక్ష సాక్షి కోర్టుకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని, కేవలం మాట్లాడుకుంటున్నట్టు విన్నానని మాత్రమే చెప్పడాన్ని మనం అంగీకరించలేం అని తెలిపారు. తన భర్తకు ప్రాణహాని ఉందన్నారు.

సమీర్‌ వాంఖడే నిజాయతీ కలిగిన అధికారి గనకే చాలామంది ఆయన్ను బయటకు పంపాలనుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. సమీర్‌ క్లీన్‌గా బయటకు వస్తారని, నిజమే గెలుస్తుందన్నారు. అన్నింటినీ కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. నవాబ్‌ మాలిక్‌ మరిన్ని డాక్యుమెంట్లను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారనీ.. కానీ అవి నిరూపితం కావాలన్నారు. మహారాష్ట్ర పౌరురాలినైనందుకు తాను గర్వపడుతున్నప్పటికీ తన రాష్ట్రంలోనే తమకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని వాపోయారు. అలాగే, తమకు విశేష మద్దతు వస్తోందన్నారు. మహారాష్ట్ర పోలీసులు తమకు రక్షణ కల్పిస్తున్నప్పటికీ సమీర్‌ వాంఖడేకు వ్యతిరేకంగా ఉన్నవారి నుంచే భయం ఉత్పన్నమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని