బ్రెజిల్‌లో 5 లక్షల కరోనా మరణాలు!

కరోనా వైరస్‌ విజృంభణతో వణికిపోతోన్న బ్రెజిల్‌కు తాజాగా మూడో ముప్పు ముంచుకొచ్చింది.

Published : 20 Jun 2021 23:32 IST

ఆంక్షల సడలింపుతో థర్డ్‌వేవ్‌ ఉద్ధృతి

బ్రెసీలియా: కరోనా వైరస్‌ విజృంభణతో వణికిపోతోన్న బ్రెజిల్‌కు మూడో ముప్పు ముంచుకొచ్చింది. నిత్యం వేల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అక్కడ కొవిడ్‌ మరణాల సంఖ్య 5లక్షలు దాటింది. మరణాల సంఖ్యలో అమెరికా తర్వాత బ్రెజిల్‌ రెండో స్థానంలో నిలిచింది. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పక్కనబెట్టడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతుండడంతో బ్రెజిల్‌ మరోముప్పు ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కాస్త తగ్గుముఖం పడుతున్నప్పటికీ దక్షిణ అమెరికా దేశాలు మాత్రం విలవిల్లాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న బ్రెజిల్‌లో కరోనా వ్యాప్తి అదుపులోకి రావడంలేదు. తాజాగా అక్కడ మూడో దశ విజృంభణ మొదలైందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 24గంటల్లోనే 2,300 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5లక్షలు దాటింది. నమోదైన మరణాల సంఖ్య ఇలా ఉంటే... వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సెకండ్‌ వేవ్‌కి విలవిల..

ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ నెల మధ్య కాలంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణతో బ్రెజిల్‌ వణికిపోయింది. మనాస్‌లో వెలుగు చూసిన గామా వేరియంట్‌ దాటికి పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ ప్రభావం మే వరకు కొనసాగింది. కాస్త గడువిచ్చినట్లు కనిపించినప్పటికీ.. ప్రస్తుతం మరోసారి విశ్వరూపం చూపిస్తోంది. మే 10 తర్వాత కొవిడ్‌ మరణాల సంఖ్య తొలిసారి 2వేలు దాటింది. 

మాస్కులు లేకుండానే..!

బ్రెజిల్‌లో ప్రస్తుతం కొవిడ్‌ ఆంక్షలకు సడలింపు ఇచ్చారు. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు సమూహాలుగా ఏర్పడుతున్నారు. బార్లు, రెస్టారెంట్లు సాధారణ స్థితికి చేరుకోవడం, షాపింగ్‌ సమయాల్లోనూ ప్రజలు మాస్కులు ధరించకుండా కనిపిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 27రాష్ట్రాల్లో దాదాపు 19రాష్ట్రాల్లో కొవిడ్‌ ఐసీయూ బెడ్లు 80శాతం నిండివున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటిలో తొమ్మిది రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు సమాచారం. రోజువారీ మరణాల సంఖ్య 2వేలు ఉన్న సమయంలోనే కొవిడ్‌ ఆంక్షలు ఎత్తివేయడం తొందరపాటు చర్యేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని