Updated : 14/10/2020 01:22 IST

రెండోసారి కరోనా.. రోగనిరోధకతపై అనుమానాలు!

లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన కీలక అధ్యయనం

ప్యారిస్‌: మహమ్మారి కరోనాతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయారు. అనేక మంది వైరస్‌ బారిన పడ్డారు. అయితే, వీరిలో చాలా మంది కోలుకుంటుండడం ఇప్పటి వరకు ఊరటనిస్తున్న అంశం. భారత్‌లో గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. వైరస్‌ను మొత్తంగా కట్టడి చేయలేకపోతున్నా.. మరణాలనైనా అదుపు చేయగలుగుతున్నామని సాంత్వన చెందుతున్నాం. ఈ తరుణంలో ఒకే వ్యక్తికి రెండోసారి వైరస్‌ సోకుతోందన్న వార్త తీవ్రంగా కలచివేస్తోంది. పైగా అది మరింత తీవ్రంగా ఉంటోందన్న అధ్యయనం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు ప్రముఖ జర్నల్‌ ల్యాన్సెట్‌లో ప్రచురితమైన ‘నెవాడా స్టేట్‌ పబ్లిక్‌ హెల్త్‌ లేబోరేటరీ’ అధ్యయనం చేదు విషయాల్ని మన ముందుంచింది. 

ప్రాణాంతక కరోనా వైరస్‌ రెండోసారి సోకే అవకాశం ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. రెండోసారి సోకినప్పుడు లక్షణాలు తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇందుకు అమెరికాలోని నెవాడాకు చెందిన 25 ఏళ్ల యువకుడి ఉదంతాన్ని ఉదహరించింది. 48 రోజుల వ్యవధిలో రెండోసారి అతనికి వైరస్‌ సోకడాన్ని నిర్ధరించింది. రెండుసార్లు వేర్వేరు రకాల వైరస్‌లు సోకినట్లు స్పష్టం చేసింది. అంటే రెండోసారి.. ఉత్పరివర్తనం చెందిన వైరస్‌ దాడి చేసినట్లు తెలిపింది. 

అసలు రోగనిరోధక శక్తి ఎన్నాళ్లుంటుంది?

రెండోసారి వైరస్‌ సోకే అవకాశం ఉందన్న నిజం మహమ్మారిని అర్థం చేసుకోవడం సహా వ్యాక్సిన్‌ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు వెల్లడించారు. ఇంకా సమర్థమైన టీకా అందుబాటులో లేని సమయంలో రెండోసారి వైరస్‌ సోకడం వల్ల తీవ్ర పరిణామాలుండే అవకాశం ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన మార్క్‌ పండోరీ తెలిపారు. అసలు కొవిడ్‌-19 బారిన పడ్డ వ్యక్తిలో రోగనిరోధక శక్తి ఎంత కాలం ఉంటుందన్న విషయంపై లోతైన అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని పండోరీ అభిప్రాయపడ్డారు. నెవాడా బాధితుడు రెండోసారి.. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న లేదా భారీ వైరల్‌ లోడ్‌కు గురై ఉంటారని అంచనా వేశారు. అందుకే తొలిసారి స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ.. రెండోసారి ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. 

రెండోసారని ఎలా నిర్ధారిస్తారు?

మరోవైపు కొంతమంది శాస్త్రవేత్తలు రెండోసారి వైరస్‌ సోకుతోందన్న వాదనను కొట్టిపారేస్తున్నారు. ఇప్పటి వరకు కోట్ల మంది వైరస్‌ బారిన పడగా.. వీరిలో కేవలం పదుల సంఖ్యలోనే రెండోసారి వైరస్‌ సోకినట్లు భావిస్తున్నామన్నారు. అయితే, తొలిసారి సోకిన వైరస్సే పూర్తిగా నయం కాకపోవడం వల్ల రెండోసారి జరిపిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలి ఉండే అవకాశం ఉందని యేల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అకికో ఇవాసకా అభిప్రాయపడ్డారు. పరీక్షల్లో లోపం వల్ల వైరస్‌ బాధితుడికి ఓసారి నెగెటివ్‌ మరోసారి పాజిటివ్‌గా తేలే అవకాశం ఉందన్నారు. లేదా తొలిసారి వైరస్‌ సోకినప్పుడు ఏర్పడ్డ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండి ఉండవచ్చునన్నారు. ఇలాంటి మరిన్ని కేసులు.. తరచూ సంభవిస్తే లోతైన పరిశోధన జరపాలన్నారు. ఇది వ్యాక్సిన్‌‌ అభివృద్ధికి కూడా దోహదం చేస్తుందన్నారు. నిరోధకత ఏ స్థాయిలో ఉంటే వైరస్‌ను టీకా అడ్డుకోగలుగుతుందనే విషయాన్ని ముందుగానే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని