Republic Day: ‘విరాట్‌’కు వీడ్కోలు పలికిన రాష్ట్రపతి, ప్రధాని..!

గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ ‘విరాట్‌’కు వీడ్కోలు పలికారు. ఇంతకీ ఈ విరాట్ ఎవరంటే.. ప్రెసిడెంట్ బాడీగార్డ్స్ దళంలో సేవలందించిన ఒక అశ్వం. ఇది ఇప్పటికి 13 సార్లు గణతంత్ర దినోత్సవ పరేడ్‌లలో పాల్గొంది. వయసు మీద పడటంతో ఇప్పుడు దీని సేవలకు ముగింపు పలికారు. 

Updated : 24 Jan 2024 17:15 IST

ఇంతకు ఎవరీ విరాట్‌..?

దిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ ‘విరాట్‌’కు వీడ్కోలు పలికారు. ఇంతకీ ఈ విరాట్ ఎవరంటే.. ప్రెసిడెంట్ బాడీగార్డ్స్ దళంలో సేవలందించిన ఒక అశ్వం. ఇది ఇప్పటికి 13 సార్లు గణతంత్ర దినోత్సవ పరేడ్‌లలో పాల్గొంది. వయసు మీద పడటంతో ఇప్పుడు దీని సేవలకు ముగింపు పలికారు. 

ఈ పరేడ్ అనంతరం రాష్ట్రపతి, ప్రధాని, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దాని చెంతకు వెళ్లారు. ఆత్మీయంగా తట్టి, వీడ్కోలు పలికారు. ఇదిలా ఉండగా దీని సేవలకు గుర్తుగా.. జనవరి 15న ఆర్మీ డే సందర్భంగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ లభించింది. ఈ అశ్వం అసాధారణ సేవలు, సామర్థ్యం ఆధారంగా ఈ కమెండేషన్ (ప్రశంస) దక్కింది. ఇలాంటి ఒక సత్కారం పొందిన మొదటి అశ్వం ఇది మాత్రమే.   

హనోవేరియన్ జాతికి చెందిన ఈ గుర్రం.. 2003లో బాడీగార్డ్స్‌తో చేరింది. దీనిని ప్రెసిడెంట్స్ బాడీగార్డ్స్‌ ‘‘ఛార్జర్’’ అని కూడా పిలుస్తారు. కవాతు సమయంలో ఇది అత్యంత విశ్వసనీయంగా వ్యవహరిస్తుందని పేరు. వయసు మీద పడినప్పటికీ.. 2021లో గణతంత్ర దినోత్సవ వేడుక, బీటింగ్ ది రిట్రీట్ వేడుకలో అద్భుతంగా రాణించిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. 

ప్రెసిడెంట్స్ బాడీగార్డ్స్‌ భారత సైన్యంలోని అత్యంత శ్రేష్ఠమైన రెజిమెంట్. 200 మందితో కూడిన బలమైన అశ్వికదళ యూనిట్. ఇది బ్రిటిష్ వైస్రాయ్‌ల కాలం నుంచి ఇప్పటి దేశాధినేతల వరకూ అత్యున్నత స్థాయి వీఐపీలకు సేవలు అందిస్తోంది. ప్రతి గణతంత్ర దినోత్సవం రోజున ఈ అశ్విక దళం రాష్ట్రపతిని వేదిక వద్దకు వెళ్లే క్రమంలో ఎస్కార్ట్‌గా ఉంటుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని