Updated : 23/02/2021 14:37 IST

మార్చి చివరినాటికి యాక్టివ్‌ కేసుల్లో తగ్గుదల!

నేషనల్‌ సూపర్‌మోడల్‌ కమిటీ అంచనా

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి తీవ్రత కాస్త తగ్గుతోందని భావిస్తోన్న సమయంలోనే మరోసారి కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య దాదాపు లక్షా 50వేలకు చేరింది. అయితే, మార్చి చివరినాటికి ఈ యాక్టివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని కరోనా వైరస్‌ తీవ్రతపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్‌ సూపర్‌మోడల్‌ కమిటీ అంచనా వేసింది.

‘కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగ నిరోధకత దేశ ప్రజల్లో ఎక్కువ మందిలో ఉన్నట్లు సిరోలాజికల్‌ సర్వేలు వెల్లడిస్తున్నాయి. వీటితోపాటు వైరస్‌ను ఎదుర్కొనే సాధారణ రోగనిరోధకత కూడా భారతీయుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా సాధారణంగా పొందిన దానికంటే అదనంగా ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యాక్సినేషన్‌ వల్ల కరోనా వైరస్‌ నుంచి దీర్ఘకాలిక రక్షణ కలుగుతుంది. ఇది వైరస్‌ వ్యాప్తి కట్టడికి ఎంతో దోహదపడుతుంది’ అని నిపుణుల కమిటీ అంచనా వేసింది. వ్యాక్సిన్‌ల సమర్థతపైనా స్పందించిన కమిటీ, ఒక్కో వ్యాక్సిన్‌ సమర్థత ఒక్కోవిధంగా ఉందని, ఈ నేపథ్యంలో నియంత్రణ సంస్థల నిర్ణయంపైనే నమ్మకం ఉంచాలని అభిప్రాయపడింది.

మ్యుటేషన్‌ చెందిన కరోనా వైరస్‌ల నుంచి ఈ రోగనిరోధకత అంతగా రక్షణ కలిగించలేదని కొందరు వాదిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు కొత్తరకం వైరస్‌లను ఎదుర్కొనే సామర్థ్యం కలిగివున్నట్లు ఆయా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ పంపిణీని ముమ్మరంగా చేపట్టడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని నిపుణుల కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. భారత్‌లో కరోనా వైరస్‌ గతేడాది సెప్టెంబర్‌లోనే గరిష్ఠ తీవ్రతను చవిచూసిందని, అప్పటినుంచి కేసుల్లో తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించింది.

ఇవన్నీ తొలిదశ ముగింపు వరకు గణాంకాలు మాత్రమేనని, ఇప్పటికే పలుచోట్ల రెండోదశ వ్యాప్తి ప్రారంభమవుతోన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఇటలీ, బ్రిటన్‌, అమెరికా దేశాల్లో జరిగినట్లు ఇక్కడ నిర్లక్ష్యం చేయవద్దని నిపుణుల కమిటీ హెచ్చరించింది. కేవలం ఒక్క భారత్‌లో వైరస్‌ వ్యాప్తిని తగ్గిస్తే సరిపోదని, ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేస్తేనే ఇది అదుపులోకి వస్తుందని పేర్కొంది. అందుచేత ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. ఇందులో భాగంగా, భారత్‌లో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ వేగవంతం చేయగా, దేశ అవసరాలతో పాటే ఇతర దేశాలకు భారత్‌ వ్యాక్సిన్‌ సరఫరా చేయడం ఆహ్వానించదగ్గ విషయమని అభిప్రాయపడింది.

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నేతృత్వంలో నేషనల్‌ సూపర్‌మోడల్‌ కమిటీని కేంద్రం నియమించింది. చెన్నై గణిత కేంద్రానికి చెందిన రాజీవ్‌ ఎల్‌ కరాందికర్‌, సీఎస్‌ఐఆర్‌కు చెందిన డాక్టర్‌ శేఖర్‌ సీ.ముండే, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్‌ విద్యాసాగర్‌లతో ఏర్పాటైన నిపుణుల కమిటీ తాజాగా ఓ నివేదికను రూపొందించింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని