Published : 25/10/2021 17:11 IST

Afghan Food Crisis: ఆకలితో అలమటిస్తోన్న అఫ్గాన్‌.. సగం మంది పస్తులే!

ఆహార సంక్షోభం తీవ్రమైందన్న ఐక్యరాజ్యసమితి

కాబుల్: తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్‌లో ఆహార సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ఇప్పటికే లక్షల మందికి పూర్తి స్థాయిలో తిండి దొరకక పస్తులే ఉంటున్నారని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ శీతాకాలంలో దాదాపు సగం మంది అఫ్గాన్‌వాసులు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారని పేర్కొంటున్నాయి. తక్షణమే వీటి నుంచి బయటపడే చర్యలు చేపట్టకపోతే అఫ్గానీయుల ఆకలి కేకలతో అక్కడ దారుణ పరిస్థితులు ఏర్పడుతాయని ఐక్యరాజ్యసమితి మరోసారి హెచ్చరించింది.

‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై స్పందించకుంటే ఈ శీతాకాలంలో లక్షల మంది అఫ్గాన్‌ వాసులు వలస వెళ్లడమో లేదా ఆకలితో అలమటించడమో ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అఫ్గాన్‌ ఎదుర్కొంటున్న సంక్షోభం యెమన్‌, సిరియా దేశాల కంటే అత్యంత తీవ్రమైనది. ప్రపంచంలోనే దారుణమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అఫ్గాన్‌లో ఆహార భద్రత పూర్తిగా కుప్పకూలింది. మహా విపత్తుకు కౌంట్‌డౌన్‌ మొదలయ్యిందని.. తక్షణమే చర్యలు చేపట్టకపోతే మన చేతులతోనే విపత్తును చవిచూస్తాం’ అని ప్రపంచ ఆహార కార్యక్రమం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బియాస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆకలితో పిల్లలు చనిపోతున్నారన్న ఆయన.. వారికి సరైన ఆహారం అందిస్తామనే భరోసా కూడా ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డబ్బు రూపంలో నిధులను సత్వరమే అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డేవిడ్‌ బియాస్లీ అభిప్రాయపడ్డారు.

ప్రతి ఇద్దరిలో ఒకరికి తీవ్ర ఆహార కొరత..

అఫ్గాన్‌లో ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నట్లు ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP)తోపాటు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) హెచ్చరించాయి. ప్రస్తుతం ఇక్కడి ప్రజలు ఫేజ్‌ 3 సంక్షోభం లేదా ఫేజ్‌ 4 ఎమర్జెన్సీ ఎదుర్కొంటున్నారని స్పష్టం చేశాయి. ఫేజ్‌ 4 అంటే తీవ్ర కరవుకు దగ్గరలో ఉన్నట్లు భావిస్తారు. ఈ శీతాకాలంలో ఈ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి.

ప్రయత్నాలు చేస్తున్నాం..

ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నుంచి తమ ప్రజలను బయటపడేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తాలిబన్‌ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ పేర్కొన్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆహారం, దుస్తులు పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఈ ఇబ్బందులు పరిష్కారమవుతాయని ముజాహిద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కరువు పరిస్థితులపై మాట్లాడిన ఆయన.. ఈ శీతాకాలం పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్నారు.

ఇదిలాఉంటే,  ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తాలిబన్ల నేతృత్వంలోని అఫ్గాన్‌ను అంతర్జాతీయంగా గుర్తించేందుకు దాదాపు అన్ని దేశాలు వెనకాడుతున్నాయి. ఇదే సమయంలో అఫ్గాన్‌పై ప్రపంచ దేశాలు ఆర్థిక పరమైన ఆంక్షలు విధిస్తున్నాయి. వీటితోపాటు ఇస్లామిక్‌ స్టేట్‌ దాడులు కూడా ఎక్కువ కావడం అఫ్గానీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు వాతావరణ పరిస్థితులతో అక్కడ తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వేల మంది పేద ప్రజలు పొట్టచేతబట్టుకుని నగరాలకు తరలిపోతున్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్