Covid: కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల కేసులు..!

కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్య తాజాగా 25 కోట్ల మార్కును దాటింది.

Published : 09 Nov 2021 01:17 IST

పలు దేశాల్లో మళ్లీ విజృంభిస్తోన్న మహమ్మారి

న్యూయార్క్‌: కరోనా మహమ్మారి వెలుగు చూసి రెండేళ్లు సమీపిస్తున్నప్పటికీ పలు దేశాల్లో వైరస్‌ ఉద్ధృతి మాత్రం అదుపులోకి రాలేదు. కొవిడ్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను విస్తృతంగా పంపిణీ చేస్తున్నా.. మహమ్మారి నియంత్రణలోకి రావడం లేదు. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ ప్రభావంతో పలు దేశాల్లో మరోసారి విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్య తాజాగా 25 కోట్ల మార్కును దాటింది. అత్యధికంగా అమెరికాలో ఇప్పటివరకు 4.6కోట్ల కేసులు నమోదుకాగా, భారత్‌లో దాదాపు 3కోట్ల 43లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య ఈ మధ్యే 50లక్షల మార్కును దాటిన విషయం తెలిసిందే.

ప్రతి 3 నెలలకు 5కోట్ల కేసులు..

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో పలు దేశాల్లో వైరస్‌ ఉద్ధృతి కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. గడిచిన మూడు నెలలుగా రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య 36శాతం తగ్గింది. అయినప్పటికీ ప్రతి మూడు నెలల్లో 5కోట్ల మంది ఇన్‌ఫెక్షన్‌ బారినపడుతున్నారు. వైరస్‌ వెలుగు చూసిన మొదట్లో 5కోట్ల కేసులు నమోదు కావడానికి ఏడాది సమయం పట్టింది. ప్రస్తుతం ప్రతి మూడు నెలలకు 5కోట్ల కేసులు నమోదవుతున్నాయి. పలు దేశాల్లో మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.

యూరప్‌లో మళ్లీ విజృంభణ..

రష్యా, ఉక్రెయిన్‌, గ్రీస్‌ వంటి దాదాపు 55 దేశాల్లో ఇన్‌ఫెక్షన్‌లు క్రమంగా పెరుగుతున్నాయి. యూరప్‌లో పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉండడం వైరస్‌ విజృంభణకు ఒక కారణంగా తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సగానికంటే ఎక్కువగా ఈ యూరప్‌ దేశాల్లోనే నమోదవుతున్నాయి. ప్రతి నాలుగు రోజులకు ఇక్కడ 10లక్షల కేసులు బయటపడుతున్నాయి. రష్యాలో ఇప్పటివరకు 88లక్షల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. గతకొన్ని రోజులుగా అక్కడ నిత్యం వెయ్యి కొవిడ్‌ మరణాలు సంభవిస్తున్నాయి. నవంబర్‌ 8న ఒక్కరోజే అత్యధికంగా 1190 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 7వరకు రష్యాలో హాలీడే ప్రకటించారు.

వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం, ఇప్పటికే ఎంతోమంది ఇన్‌ఫెక్షన్‌ బారినపడి కోలుకోవడంతో చాలా దేశాలు వైరస్‌ ఉద్ధృతి తీవ్ర స్థాయిని దాటిపోయినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ చల్లని వాతావరణం, ప్రజలు భారీ సంఖ్యలో సమూహాలుగా ఏర్పడుతుండడం వల్ల కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటినుంచి 2022 చివరి మధ్యకాలంలో వైరస్‌ ఉద్ధృతిని కట్టడి చేయడంతోపాటు తీవ్రత ఎక్కువ కలిగిన కేసులు, మరణాలను సాధ్యమైనంత వరకు తగ్గించగలమని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రముఖ ఎపిడమాలజిస్ట్‌ మారియా వాన్‌ ఖేర్కోవ్‌ పేర్కొన్నారు.

టీకా కోసం పేద దేశాల ఎదురుచూపు..

ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ పేద దేశాల్లో మాత్రం కనీసం ఒక్క డోసు కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ఆయా దేశాల్లో ఇప్పటికీ 5శాతం కంటే తక్కువ మందికే కొవిడ్‌ టీకా అందింది. ఇలాంటి సందర్భంలో అల్ప ఆదాయ దేశాలకు వ్యాక్సిన్‌ అందించేందుకు సంపన్న దేశాలు ముందుకు రావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుసార్లు విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన 20దేశాలు దాదాపు 23.4బిలియన్‌ డాలర్ల నిధులను సమకూర్చాలని పిలుపునిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని