Nawab Malik: నవాబ్‌ మాలిక్‌వి దురుద్దేశ వ్యాఖ్యలే..! బాంబే హైకోర్టు

నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (NCB) అధికారి సమీర్‌ వాంఖడేపై ఇకపై ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని బాంబే హైకోర్టుకు మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ హామీ ఇచ్చారు.

Published : 25 Nov 2021 16:42 IST

వాంఖడేపై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశం

ముంబయి: నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (NCB) అధికారి సమీర్‌ వాంఖడేపై ఇకపై ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని బాంబే హైకోర్టుకు మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ హామీ ఇచ్చారు. ఆయనతోపాటు వాంఖడే కుటుంబానికి వ్యతిరేకంగా ట్విటర్‌లో లేదా బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయనని స్పష్టం చేశారు. తన కుటుంబంపై బహిరంగ విమర్శలు చేస్తోన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ను నిలువరించాలని కోరుతూ సమీర్‌ వాంఖడే తండ్రి వేసిన పిటిషన్‌ను నేడు బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా మాలిక్‌ తీరును తప్పుబట్టిన న్యాయస్థానం.. దురుద్దేశంతోనే ఆయన బహిరంగ వ్యాఖ్యలు, ట్వీట్లు చేస్తున్నట్లు స్పష్టమవుతోందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 9న జరిగే తదుపరి విచారణ వరకూ వాంఖడేపై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు ధర్మాసనం నవాబ్‌ మాలిక్‌ను ఆదేశించింది.

ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా.. ఇదే విషయంపై అంతకుముందు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పులోని అంశాలను వాంఖడే తరపున న్యాయవాది బీరేంద్ర సరఫ్‌ బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు ప్రస్తావించారు. సత్యాన్ని విస్మరించి నవాబ్‌ మాలిక్‌ ఆరోపణలు చేశారని.. వాంఖడేకు సంబంధించి కోర్టుకు అందజేసిన పత్రాలు కూడా ధ్రువీకరించినవి కావని గుర్తుచేశారు. కేవలం సమీర్‌ వాంఖడే, తండ్రి ధ్యాన్‌దేవ్‌ వాంఖడేలనే కాకుండా ఆయన కుటుంబంలో ఎవరినీ నవాబ్‌ మాలిక్‌ వదలలేదని తెలిపారు. ధ్యాన్‌దేవ్‌ కుమార్తెతో పాటు చనిపోయిన ఆయన భార్యపై కూడా రాష్ట్రమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారని హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

వాంఖడే తరపున న్యాయవాది వాదన విన్న హైకోర్టు ధర్మాసనం.. ఈ ఆరోపణలకు సంబంధించి నవాబ్‌ మాలిక్‌ ఫిర్యాదు చేశారా? అని మాలిక్‌ తరపున న్యాయవాదిని ప్రశ్నించింది. దీంతో ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదనే సమాధానం వచ్చింది. అటువంటప్పుడు మంత్రి ఇలాంటి బహిరంగ ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు? కేవలం మీడియాలో పబ్లిసిటీ కోసమేనా..? ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు తెలియాలి? ఇది దురుద్దేశంతో చేసినవేనని స్పష్టమవుతోంది’ అంటూ హైకోర్టు ధర్మాసనం నవాబ్‌ మాలిక్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ఇదిలాఉంటే, ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసుకు నేతృత్వం వహించిన ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ వరుస ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు కుటుంబానికి పరువునష్టం కలిగించే ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా నవాబ్‌ మాలిక్‌ను నిరోధించాలని కోరుతూ సమీర్‌ వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్‌ వాంఖడే హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై తొలుత విచారణ జరిపిన న్యాయస్థానం.. ఒకవేళ ఆయన చూపిస్తున్న పత్రాలు ధ్రువీకరించినవే అయితే మాలిక్‌ను నిలువరించలేమని పేర్కొంది. ఇలా సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు ధ్యాన్‌దేవ్‌కు ఎటువంటి ఊరట కలుగలేదు. దీంతో సింగిల్‌ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ధ్యాన్‌దేవ్‌ వాంఖడే మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. మాలిక్‌ వ్యాఖ్యలు దురుద్దేశంతో కూడుకున్నట్లు స్పష్టమవుతోందని అభిప్రాయపడింది. తదుపరి విచారణ వరకు సమీర్‌ వాంఖడే, ఆయన కుటుంబంపై ఎటువంటి ఆరోపణలు చేయవద్దని మంత్రిని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని