Published : 02/09/2021 18:31 IST

Afghanistan Crisis: ఆకలితో అల్లాడుతోన్న అఫ్గానిస్థాన్‌..!

30శాతానిపైగా పౌరులకు సరైన తిండే దొరకడం లేదన్న ఐరాస

కాబుల్‌: తాలిబన్ల ఆక్రమిత అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాలిబన్ల భయంతో వణికిపోతోన్న అఫ్గాన్‌ వాసులకు రానున్న రోజుల్లో దేశంలో ఆహార సంక్షోభం తీవ్రమవుతుందనే వార్తలు మరింత కలవరపెడుతున్నాయి. ఇప్పటికే దేశంలో 30శాతానికిపైగా పౌరులు నిత్యం కనీసం ఒకపూట భోజనం చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో దేశంలో ప్రస్తుతమున్న ఆహార నిల్వలు కూడా ఈ నెలతోనే పూర్తిగా నిండుకునే ప్రమాదం ఉందని ఐరాస హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో నెలకొన్న సంక్షోభం రానున్న రోజుల్లో ఓ విపత్తుగా మారకుండా ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఐరాస పిలుపునిచ్చింది.

దీనస్థితిలో చిన్నారులు..

దేశంలో సంక్షోభ పరిస్థితుల కారణంగా తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. దీంతో ఐదేళ్ల కంటే చిన్నారుల్లో సగం మందికిపైగా తీవ్ర పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. అంతేకాకుండా ముప్పై శాతం మంది పౌరులకు కూడా సరైన తిండి దొరకడం లేదని ఐరాస హ్యుమానిటేరియన్‌ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. వారంతా ప్రతిరోజు భోజనం చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించింది. ఆహారం, వైద్య సదుపాయాలు, ఆహారేతర అత్యవసర వస్తువులను తక్షణమే అందించే చర్యల ద్వారా అఫ్గాన్‌ మరింత విపత్కర పరిస్థితుల్లోకి దిగజారకుండా నిరోధించవచ్చని అభిప్రాయపడింది.

ఆకలితో ఉన్న లక్షల మందిని ఆదుకునేందుకు ఐరాస కృషి చేస్తున్నప్పటికీ.. సెప్టెంబర్‌ చివరి నాటికి ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) నిల్వలు నిండుకునే ప్రమాదం ఉండడం ఆందోళన కలిగిస్తోందని అఫ్గాన్‌లో ఐరాస హ్యుమానిటేరియన్‌ విభాగం ప్రతినిధి రమీజ్‌ అలక్‌బరోవ్‌ పేర్కొన్నారు. ఇలాంటి కీలక సమయంలో అఫ్గాన్‌కు సహకరించేందుకు మరిన్ని నిధులు కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ దృష్ట్యా కేవలం దీనస్థితిలో ఉన్న చిన్నారుల ఆహారం కోసమే 200 మిలియన్‌ డాలర్లు అవసరమని అంచనా వేశారు. ఇందుకోసం అత్యవసర సహాయం కోసం ఐరాస త్వరలోనే ఓ ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు.

ఇదిలాఉంటే, అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వానికి నిధులు ఎక్కువగా అంతర్జాతీయ సంస్థలు, ఇతర దేశాల నుంచే వస్తాయని అంచనా. గతకొన్ని రోజులుగా అక్కడ ఏర్పడ్డ పరిస్థితులతో ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు ఆర్థిక సహాయాన్ని నిలిపివేశాయి. వీటితో పాటు విదేశాల్లో ఉన్న నిధులను తాలిబన్లు వినియోగించకుండా అమెరికా వంటి దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో అఫ్గాన్‌కు ఆర్థిక కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో  అనేకమంది అఫ్గాన్‌ పౌరులు దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని