Omicron: ఒమిక్రాన్‌పై భయంతో భార్యాపిల్లలను హతమార్చిన వైద్యుడు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో మానసిక అనారోగ్యానికి గురైన ఓ వైద్యుడు భార్యాపిల్లల్ని హతమార్చాడు.......

Published : 05 Dec 2021 02:05 IST

కాన్పుర్‌: ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పూర్​​లో దారుణం చోటుచేసుకుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో మానసిక అనారోగ్యానికి గురైన ఓ వైద్యుడు భార్యాపిల్లల్ని హతమార్చాడు. కాన్పుర్‌లోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతిగా పనిచేస్తున్న సుశీల్‌.. కల్యాణ్‌పుర్‌లోని సొంత అపార్ట్‌మెంట్‌లో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ హత్యల వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ.. తన డైరీలో ఓ నోట్‌ రాశాడు. ‘మహమ్మారి వల్ల కలిగే సవాళ్ల నుంచి విడిపించడం సహా.. వారి కష్టాలన్నింటినీ క్షణాల్లో తొలగించేందుకే ఇలా చేశాను’ అని తన డైరీలో పేర్కొన్నాడు. నయం చేయలేని ఓ వ్యాధితో తాను  బాధపడుతున్నట్లు అందులో తెలిపాడు. కొవిడ్‌ ప్రతి ఒక్కరిని చంపేస్తుందని అందులో పేర్కొన్నాడు. ఈ హత్యల విషయంపై సోదరుడికి ఓ మెసేజ్‌ కూడా చేశాడు.

కుటుంబ సభ్యుల హత్యలకు పాల్పడిన సుశీల్.. దీని గురించి పోలీసులకు తెలియజేయాలని కోరుతూ తన సోదరుడు సునీల్‌కు ఫోన్​లో ఓ సందేశం పంపాడు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసిన సునీల్‌.. వెంటనే అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా బయట నుంచి తాళం వేసి ఉంది. అంతలోపే అక్కడకు చేరుకున్న పోలీసులు.. సెక్యూరిటీ గార్డుల సహాయంతో తాళం పగలగొట్టి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారు. అక్కడి దృశ్యాలను చూసి నిశ్చేష్టులయ్యారు. వైద్యుడి భార్య చంద్రప్రభ (48) సహా మైనర్లైన కుమారుడు శిఖర్ సింగ్, కుమార్తె ఖుషీ సింగ్‌ మృతదేహాలు వేర్వేరు గదుల్లో రక్తపు మడుగులో పడి ఉన్నాయి. భార్యను గొంతునులిమి హత్య చేసిన నిందితుడు.. కుమారుడు, కుమార్తెను సుత్తితో కొట్టి హతమార్చాడు. అంతకుముందే వీరందరికీ టీలో మత్తు మందు ఇచ్చాడని.. అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత హత్య చేశాడని పోలీసు అధికారి వెల్లడించారు.

‘తీవ్ర కుంగుబాటుకు గురయ్యా. ఈ సమయంలో నా కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేయలేను. అందుకే కుటుంబం మొత్తానికి విముక్తి కల్పించా. ఒక్క క్షణంలో వారి కష్టాలన్నింటినీ తొలగిస్తున్నా. కరోనా ఎవరినీ అంత సులువుగా విడిచిపెట్టదు. నయంకాని వ్యాధితో బాధపడుతున్న నాకు.. భవిష్యత్తు శూన్యంగా మారింది’ అని సోదరునికి పంపిన సందేశంలో సుశీల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. సుశీల్‌ను పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు కమిషనర్ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని