G20 Summit: అఫ్గాన్‌ను ఉగ్రవాదానికి కేంద్రంగా మారనీయొద్దు..!

అఫ్గానిస్థాన్‌ భూభాగాన్ని ఉగ్రవాదానికి కేంద్రంగా మారకుండా చూసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పిలుపునిచ్చారు.

Updated : 13 Oct 2021 09:45 IST

ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు

దిల్లీ: అఫ్గానిస్థాన్‌ భూభాగాన్ని ఉగ్రవాదానికి కేంద్రంగా మారకుండా చూసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పిలుపునిచ్చారు. అందుకనుగుణంగా ఆ దేశంలో అవసరమైన మార్పులు తీసుకువచ్చేందుకు ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. అఫ్గానిస్థాన్‌ అంశంపై ప్రత్యేకంగా జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో వర్చువల్‌ పద్ధతిలో పాల్గొన్న మోదీ.. అఫ్గాన్‌ను ఆదుకోవడంలో భాగంగా అత్యవసర మానవతా సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా అన్ని దేశాలతో కలిసి ముందుకుసాగే విధంగా అక్కడి పాలనా వ్యవస్థ రూపుదిద్దుకోవాల్సి ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఈమధ్యే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) చేసిన తీర్మానం ఆధారంగా అంతర్జాతీయ సమాజం ఐకమత్యంగా స్పందించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. అఫ్గాన్‌ ప్రజలు పడుతున్న ఆకలి బాధలు, పోషకాహార లోపం వంటి సమస్యల తీవ్రతను ప్రతి భారతీయుడూ అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించి అఫ్గానిస్థాన్‌కు మనవతా సహాయం అందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ఇదిలాఉంటే, అఫ్గాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా అక్కడ తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. దీంతో ఐదేళ్ల కంటే తక్కువ వయసు కలిగిన చిన్నారుల్లో సగం మందికిపైగా తీవ్ర పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. అంతేకాకుండా ముప్పై శాతం మంది పౌరులకు కూడా సరైన తిండి దొరకడం లేదని ఐరాస హ్యుమానిటేరియన్‌ విభాగం ఆందోళన వ్యక్తంచేసింది. వారంతా ప్రతిరోజు భోజనం చేస్తున్నారో, లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించింది. ఆహారం, వైద్య సదుపాయాలు, ఆహారేతర అత్యవసర వస్తువులను తక్షణమే అందించే చర్యల ద్వారా అఫ్గాన్‌ మరింత విపత్కర పరిస్థితుల్లోకి దిగజారకుండా నిరోధించవచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే వర్చువల్‌ పద్ధతిలో ప్రత్యేకంగా సమావేశమైన జీ20 సభ్య దేశాలు.. అఫ్గాన్‌కు చేయాల్సిన తక్షణ సహాయంపై చర్చించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని