Narayan Rane: మరికొద్ది రోజుల్లో మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం: కేంద్రమంత్రి

త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వంలో ఊహించని మార్పులు సంభవిస్తాయని కేంద్రమంత్రి నారాయణ్‌ రాణే పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు భాజపా అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు......

Published : 26 Nov 2021 23:04 IST

దిల్లీ: త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వంలో ఊహించని మార్పులు సంభవిస్తాయని కేంద్రమంత్రి నారాయణ్‌ రాణే పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు భాజపా అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూలిపోనుందని.. ఈ తరహా అంశాలకు సంబంధించిన కొన్ని విషయాలను రహస్యంగా ఉంచడమే మేలని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఓ కార్యక్రమంలో నారాయణ్‌ రాణే మాట్లాడారు. ‘వచ్చే ఏడాది మార్చి నాటికి మహారాష్ట్రలో భాజపా అధికారంలో ఉంటుంది’ అని అన్నారు. అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘కొన్ని విషయాలను వెల్లడించలేము. ప్రభుత్వాన్ని దించాలన్నా.. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా కొన్ని విషయాలను గోప్యంగానే ఉంచాలి’ అని వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోగ్య పరిస్థితులపైనా కేంద్రమంత్రి మాట్లాడారు. ‘ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోగ్యం ఇప్పుడు బాగోలేదు. అందుకే ఆయన గురించి మాట్లాడొద్దు అని పార్టీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ మాతో అన్నారు. మూడు పార్టీలతో కూడిన మహా వికాస్‌ అఘాడీ ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదు’ అని కేంద్రమంత్రి పేర్కొనడం పలు ఊహాగానాలకు తెరలేపుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన కలిసి ఏర్పాటుచేసిన మహా వికాస్ అఘాడీ అధికారంలో ఉంది. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే సీఎంగా ఉన్నారు. అయితే రెండు వారాల క్రితమే ఆయనకు వెన్నెముక శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని