Mother on Campus: హాస్టళ్లలో ‘అమ్మ ప్రేమ’.. వినూత్న కార్యక్రమానికి త్రిపుర శ్రీకారం

హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా, విద్యావ్యవస్థను బలపరిచేలా త్రిపుర సర్కారు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. అదే ‘మదర్​ ఆన్​ క్యాంపస్​’......

Published : 18 Nov 2021 00:04 IST

అగర్తల: హాస్టళ్లలో అమ్మ ప్రేమ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా, విద్యావ్యవస్థను బలపరిచేలా త్రిపుర సర్కారు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. అదే ‘మదర్​ ఆన్​ క్యాంపస్​’. విద్యార్థితో తన తల్లి కొద్దిరోజులపాటు హాస్టల్‌లోనే ఉండటం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడనుంది. త్రిపుర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రతన్​ లాల్​ నాథ్​ ఈ పథకం గురించి వివరించారు.

ఈ పథకంపై విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ.. ‘తల్లులతోనే పిల్లలు సన్నిహితంగా ఉంటారు. విద్యార్థికి తల్లే తొలి టీచర్​. అందుకే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాము. ఇందులో భాగంగా.. హాస్టల్‌లోని మొత్తం విద్యార్థుల వద్ద ఇద్దరు తల్లులు రెండు వారాల పాటు ఉంటారు. మరో రెండు వారాలు ఇంకో ఇద్దరు విద్యార్థుల తల్లులు ఉంటారు. దీంతో తాము భద్రంగా ఉన్నామని విద్యార్థులకు నమ్మకం కలుగుతుంది. హాస్టళ్లల్లో తల్లులు ఉంటే.. విద్యార్థుల చదువులు మెరుగుపడతాయి. అదే సమయంలో హాస్టళ్ల నిర్వహణ బాగుంటుంది. ఇక్కడ పిల్లలతో సమయం గడపడం తప్ప తల్లులు వేరే పని చేయరు’ అని రతన్‌ లాల్‌ నాథ్‌ వివరించారు. భవిష్యత్తు తరాల విద్యార్థులపైనే రాష్ట్రాభివృద్ధి ఆధారపడి ఉందని పేర్కొన్నారు.

హాస్టళ్లలోకి తల్లులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు​. తల్లులు రెండు వారాల పాటు కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదని, వారి ఇష్టం మేరకు 3,4 రోజుల తర్వాత కూడా వెళ్లిపోవచ్చన్నారు. బాలుర హాస్టళ్లలో తల్లులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని