Jammu and Kashmir: జైషే చీఫ్‌ మసూద్‌ బంధువు.. ఎన్‌కౌంటర్‌లో హతం

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ కాల్పుల్లో జైషే మహమ్మద్‌ ఉగ్రముఠాకు చెందిన టాప్‌ కమాండర్‌ లంబూ సహా

Published : 31 Jul 2021 15:08 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ కాల్పుల్లో జైషే మహమ్మద్‌ ఉగ్రముఠాకు చెందిన టాప్‌ కమాండర్‌ లంబూ సహా ఇద్దరు ముష్కరులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. హతుడు లంబూ.. జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ బంధువని తెలిసింది. సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలోనూ ఇతడి హస్తం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

పుల్వామాలోని నమిబియన్‌, మర్సార్‌ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భద్రతాబలగాలు ఈ ఉదయం కార్డన్‌ సెర్చ్‌ చేపట్టాయి. భద్రతాసిబ్బంది తనిఖీలు చేస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదుల వివరాలను వెల్లడించారు. హతుల్లో ఒకడు జైషే కీలక ఉగ్రవాది లంబూగా గుర్తించినట్లు తెలిపారు. మరో ఉగ్రవాది వివరాలు తెలియాల్సి ఉందన్నారు. 

కాగా.. లంబూ అలియాస్‌ మహమ్మద్‌ ఇస్లామ్‌ అల్వీ అలియాస్‌ అద్నన్‌.. దక్షిణ కశ్మీర్‌లో జైషే ఆపరేషనల్‌ కమాండర్‌గా ఉన్నాడు. జైషే ఉగ్రముఠా అధినేత, ముంబయి పేలుళ్ల సూత్రధారి మసూద్‌ అజార్‌కు లంబూ దగ్గరి బంధువని ఐజీ విజయ్‌కుమార్‌ వెల్లడించారు. 2017లో భారత్‌లోకి చొరబడిన లంబూ.. అప్పటి నుంచి దక్షిణ కశ్మీర్‌లో అనేక ఉగ్రకార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఐఈడీ బాంబుల తయారీలో నిపుణుడైన ఇతడు.. 2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలోనూ కీలక సూత్రధారి అని ఐటీ తెలిపారు. 

సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది అదిల్‌ దార్‌తో  లంబూ టచ్‌లో ఉన్నాడని, అప్పట్లో వైరల్‌గా మారిన అదిల్‌ దార్‌ వీడియోలోనూ ఇతడి గొంతు వినిపించిందని చెప్పారు. పుల్వామా దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ సమర్పించిన ఛార్జ్‌షీట్‌లోనూ లంబూ పేరు ఉందని పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరిలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన భీకర ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని