Tit-For-Tat: బ్రిటన్‌ పౌరులపై భారత్‌ ఆంక్షలు.. 10రోజుల క్వారంటైన్..!

బ్రిటన్‌ నుంచి వచ్చే పౌరులపై భారత్‌ ఆంక్షలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా బ్రిటన్‌ పౌరులను 10 రోజులు క్వారంటైన్‌లో ఉంచడంతోపాటు 3సార్లు కొవిడ్‌ టెస్టులు చేయించుకోవడం వంటి ఆంక్షలు అమలు చేయనుంది.

Published : 02 Oct 2021 01:47 IST

బ్రిటన్‌ వివాదాస్పద నిబంధనల నేపథ్యంలో భారత్‌ ఆంక్షలు

దిల్లీ: భారత్‌లో తీసుకున్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను తాము గుర్తించడం లేదని బ్రిటన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్నప్పటికీ భారత్‌ నుంచి బ్రిటన్‌ వెళ్లే వారికి 10రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి అంటూ అక్కడి అధికారులు పెట్టిన నిబంధనలు వివాదాస్పదమయ్యాయి. వాటిని తీవ్రంగా ఖండిస్తోన్న భారత్‌.. అలాంటి నిబంధనలు వివక్షాపూరితమేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో బ్రిటన్‌ వెనక్కి తగ్గకపోతే దీటుగా స్పందిస్తామని ఇదివరకే హెచ్చరించింది. అయినప్పటికీ బ్రిటన్‌ నుంచి సరైన స్పందన లేకపోవడంతో ప్రతిచర్యలకు దిగిన భారత్‌.. అక్కడ నుంచి వచ్చే పౌరులపైనా ఆంక్షలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా బ్రిటన్‌ పౌరులను 10 రోజులు క్వారంటైన్‌లో ఉంచడంతోపాటు 3సార్లు కొవిడ్‌ టెస్టులు వంటి ఆంక్షలు అమలు చేయనుంది. అక్టోబర్‌ మొదటి వారం నుంచే ఈ నిబంధనలు అమల్లో ఉండనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అక్టోబర్‌ 4వ తేదీ నుంచి భారత్‌కు వచ్చే బ్రిటన్‌ పౌరులు 3 ఆర్‌టీ పీసీఆర్‌ రిపోర్టులు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.  ప్రయాణానికి 72గంటల ముందు ఒకసారి, ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత మరోసారి, అనంతరం 8వ రోజు ఇలా మొత్తంగా మూడుసార్లు కొవిడ్‌ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. భారత్‌కు చేరుకున్న తర్వాత ఇంటివద్ద/ హోటల్‌లో 10 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలి. వ్యాక్సిన్‌ తీసుకున్నారా? లేదా అనే విషయంతో సంబంధం లేకుండా బ్రిటన్‌ పౌరులకు ప్రతి ఒక్కరికీ ఈ నిబంధనలు పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌-ఎన్‌బయోటెక్‌, మోడెర్నాలతో పాటు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాలను మాత్రమే గుర్తిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం పేర్కొంది. దీంతో భారత్‌లో తయారయ్యే కొవిషీల్డ్‌ టీకాను గుర్తించడం లేదని నిబంధనల్లో పేర్కొనడం వివాదాస్పదమైంది. ఇలాంటి నిబంధనలు వివక్షాపూరితమైనవేనని భారత ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఇదే సమయంలో బ్రిటన్‌ నిబంధనలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర గందరగోళానికి దారి తీస్తున్నాయని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా కూడా పేర్కొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని