Updated : 19/11/2021 17:26 IST

Farm Laws: అమలుకు ముందే రద్దుకు.. సాగుచట్టాల ‘ప్రస్థానం’ సాగిందిలా!

రైతుల ఆందోళనలతో వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: పరిపాలనలో భాగంగా విధానపరమైన నిర్ణయాలను అమలు చేసే ముందు ప్రభుత్వాలు భారీ కసరత్తు చేస్తుంటాయి. కొత్త చట్టాన్ని తెచ్చేందుకు నిర్ణయం తర్వాత తొలుత వాటిని బిల్లు రూపంలో ప్రవేశపెట్టి.. చర్చల ద్వారా చట్టసభల ఆమోదానికి ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలోనే దేశంలో వ్యవసాయ రంగంలో పలు మార్పులను తెచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతేడాది కొత్తగా మూడు సాగుచట్టాలను తీసుకువచ్చింది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి.. రైతులు తమ పంటలకు తగిన గిట్టుబాటు ధర పొందేందుకూ; ప్రైవేటు పెట్టుబడులు, సాంకేతికతను సమకూర్చుకునేందుకు దోహదపడే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను తీసుకొచ్చింది.

1. నిత్యవసర సరకుల(సవరణ) బిల్లు (ది ఎసెన్షియల్ కమోడిటీస్(అమెండ్మెం‌ట్) బిల్ 2020)

2. రైతులు తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనను తొలగిస్తూ తీసుకొచ్చిన... ‘ది ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌) బిల్లు’.

3. పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంపై వ్యాపారులతో రైతులు చేసుకొనే ఒప్పందాలకు రక్షణ కల్పించే... ‘ది ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫార్మ్‌ సర్వీసెస్‌ బిల్లు-2020’.

అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లులను కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాయి. రైతుల హక్కులను కాలరాసేందుకే ఈ బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చిందని విరుచుకుపడ్డాయి. అయినప్పటికీ ఎలాగోలా చివరకు వాటిని పార్లమెంటులో ఆమోదముద్ర వేయించున్న ప్రభుత్వం.. భారత రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం కల్పించింది. కానీ, వాటి అమలులో మాత్రం రైతుల్లోని కొన్ని వర్గాలను ఒప్పించ లేకపోయింది. వీటిని వ్యతిరేకిస్తూ దాదాపు ఏడాది (నవంబర్‌ 26కు) కాలంపాటు రైతు సంఘాలు ఉద్యమం చేపట్టాయి. ముఖ్యంగా పంజాబ్‌, హరియాణా రైతులు దిల్లీ సరిహద్దుల్లో చేసిన ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులను కూడా కదిలించాయి. ఇలా రైతుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో వెనక్కితగ్గిన కేంద్ర ప్రభుత్వం.. మూడు చట్టాలను రద్దు చేసుకుంటున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడు వ్యవసాయ చట్టాలను ప్రస్థానం ఎలా సాగిందో ఓసారి గుర్తుచేసుకుందాం.

* జూన్‌ 5, 2020   :  మూడు వ్యవసాయ చట్టాలను తేనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు (ఆర్డినెన్స్‌) జారీ


* సెప్టెంబర్‌ 14, 2020  :  పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్‌


* సెప్టెంబర్‌ 17, 2020  :  మూడు బిల్లుకు లోక్‌సభ ఆమోదం


* సెప్టెంబర్‌ 20, 2020  :  వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం


* సెప్టెంబర్‌ 25, 2020  :  వీటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలకు కిసాన్‌ సంఘర్ష్‌ కోఆర్డినేషన్‌ కమిటీ పిలుపు


* సెప్టెంబర్‌ 27, 2020  :  రాష్ట్రపతి ఆమోదం, గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలతో చట్టరూపంగా మారిన మూడు బిల్లులు


* నవంబర్‌ 25, 2020  :  వీటిని నిరసిస్తూ ‘చలో దిల్లీ’కి పంజాబ్‌, హరియాణా రైతులు పిలుపు


* నవంబర్‌ 26, 2020  :  దిల్లీ వైపు దూసుకెళ్లిన రైతులను నగర సరిహద్దుల్లోనే అడ్డుకున్న పోలీసులు


* నవంబర్‌ 28, 2020  :  రైతులతో చర్చించేందుకు సిద్ధమని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటన


* డిసెంబర్‌ 3, 2020   :  తొలిసారిగా రైతు సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు.. డిసెంబర్‌ 5న రెండోసారి చర్చలు


* డిసెంబర్‌ 8, 2020  :   ‘భారత్‌ బంద్‌’కు రైతు సంఘాల పిలుపు. ఇందుకు మద్దతు తెలిపిన పలు రాష్ట్రాల రైతులు


* డిసెంబర్‌ 9, 2020  :   చట్టాలకు సవరణ చేస్తామని ప్రభుత్వ ప్రతిపాదనకు నిరాకరించిన రైతు సంఘాలు


* డిసెంబర్‌ 11, 2020  :  వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన భారతీయ కిసాన్‌ యూనియన్‌ (BKU)


* జనవరి 4, 2021    :   ఏడోసారి రైతులు - కేంద్రం మధ్య చర్చలు జరిగినప్పటికీ.. చట్టాల రద్దుకు కేంద్రం నిరాకరణ


* జనవరి 7, 2021    :   సాగుచట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం అంగీకారం


* జనవరి 12,2021    :   వ్యవసాయ చట్టాలపై ‘స్టే’ విధించిన సుప్రీంకోర్టు, సాగు చట్టాలపై సిఫార్సులు చేసేందుకు నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు


* జనవరి 26, 2021   :   గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకం. ఆందోళనకారుల నిరసనలతో అట్టుడికిన ఎర్రకోట. ఆరోజు జరిగిన ఘటనలో ఓ రైతు బలి


* జనవరి 29, 2021   :   ఏడాదిన్నరపాటు ఈ మూడు చట్టాలను తాత్కాలికంగా నిలిపివేస్తామని కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదన


* ఫిబ్రవరి 5, 2021    :   రైతుల ఆందోళనలపై తయారుచేసిన ‘టూల్‌కిట్‌’ వ్యవహారంపై దిల్లీ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు


* మార్చి 6, 2021    :    దిల్లీ సరిహద్దులో 100 రోజులకు చేరిన రైతుల ఆందోళన


* మే 27, 2021      :    రైతుల ఉద్యమం ఆరు నెలలకు చేరుకోవడంతో ‘బ్లాక్‌ డే’గా ప్రకటించిన రైతు సంఘాలు


* జులై 22, 2021     :    వర్షాకాల సమావేశాల సందర్భంగా దాదాపు 200 రైతులు పార్లమెంట్‌ ముట్టడికి ప్రయత్నం


* ఆగస్టు 7, 2021     :   సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న 14 ప్రతిపక్ష పార్టీలు


* అక్టోబర్‌ 22, 2021   :   ప్రజలకు నిరసన చేసే హక్కు ఉన్నప్పటికీ.. సుదీర్ఘకాలం పాటు రోడ్లను బ్లాక్‌ చేయడం సరికాదని సుప్రీం వ్యాఖ్య


* అక్టోబర్‌ 29, 2021   :   దిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన చేపట్టిన ప్రాంతం వద్ద బారీకేడ్లను తొలగించిన దిల్లీ పోలీసులు


* నవంబర్‌ 19, 2021   :   సాగు చట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని