మూడో వేవ్‌కు అంత తీవ్రత ఉండకపోవచ్చు

భారత్‌లో కరోనా మూడో వేవ్‌ వచ్చినా.. అది రెండో వేవ్‌ అంత తీవ్రంగా ఉండకపోవచ్చునని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌)కి చెందిన ఓ సీనియర్ శాస్త్రవేత్త తెలిపారు.  మూడో వేవ్‌ తప్పదంటూ విస్తృతంగా అంచనాలు వెలువడుతున్న....

Updated : 17 Jul 2021 10:33 IST

ఐసీఎంఆర్‌ సీనియర్ శాస్త్రవేత్త

ముంబయి: భారత్‌లో కరోనా మూడో వేవ్‌ వచ్చినా.. అది రెండో వేవ్‌ అంత తీవ్రంగా ఉండకపోవచ్చునని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌)కి చెందిన ఓ సీనియర్ శాస్త్రవేత్త తెలిపారు.  మూడో వేవ్‌ తప్పదంటూ విస్తృతంగా అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ఊరట కలిగిస్తున్నాయి. ఇటీవల వారు నిర్వహించిన ఓ అధ్యయనం గురించి ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు వివరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఐసీఎంఆర్‌తో పాటు ఇంపీరియల్‌ కాలేజ్ ఆఫ్‌ లండన్‌ కలిసి రూపొందించిన గణిత పద్ధతుల ఆధారంగా భారత్‌లో మూడో వేవ్‌పై అంచనాలు వేసినట్లు సీనియర్ శాస్త్రవేత్త సమీరణ్‌ పాండా తెలిపారు. వ్యాక్సినేషన్‌ వేగం తగ్గి.. కరోనా కట్టడి నిబంధనల్ని పూర్తిగా గాలికొదిలేస్తే మూడో వేవ్‌ తప్పదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరింత వేగంగా వ్యాపించే వైరస్ రకం గనక వెలుగులోకి రాకపోతే అంత ప్రమాదమేమీ ఉండదని తెలిపారు. మూడో వేవ్‌ వచ్చినా అది ఆగస్టు చివరలో వెలుగు చూడొచ్చని తెలిపారు. అయితే, రోజుకి లక్ష కేసులతో పరిస్థితులు తొలి వేవ్‌ను తలపించొచ్చని పేర్కొన్నారు. రెండో వేవ్‌ స్థాయిలో కేసులు రాకపోవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. 

వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పాండా సూచించారు. దీనివల్ల మూడో వేవ్ తీవ్రత మరింత తగ్గుతుందన్నారు. అలాగే పాజిటివిటీ రేటును బట్టి ఆంక్షల సడలింపు ఉండాలన్నారు. పర్యాటకుల వల్ల ఆయా ప్రాంతాల్లో జనసాంద్రత పెరిగే అవకాశం ఉందన్నారు. వీలైనంత వరకు అలాంటి ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని