Afghanistan: వెంటనే ఆ హోటళ్లను విడిచిపెట్టి వెళ్లిపోండి..!

అఫ్గానిస్థాన్‌ రాజధాని నగరం కాబుల్‌ హోటళ్లలో ఉన్న తమ దేశీయుల్ని సోమవారం అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు అప్రమత్తం చేశాయి. ఉగ్రముప్పు పొంచి ఉందని, ఆ నగరంలోని హోటళ్లకు దూరంగా ఉండాలని హెచ్చరించాయి. ఇటీవల ఇస్లామిక్ స్టేట్‌ ఆ దేశంలో ఉగ్రదాడికి పాల్పడిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. 

Updated : 11 Oct 2021 11:48 IST

తమ దేశీయులను అప్రమత్తం చేసిన యూఎస్‌, యూకే 

(ప్రతీకాత్మక చిత్రం)

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని నగరం కాబుల్‌ హోటళ్లలో ఉన్న తమ దేశీయుల్ని సోమవారం అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు అప్రమత్తం చేశాయి. ఉగ్రముప్పు పొంచి ఉందని, ఆ నగరంలోని హోటళ్లకు దూరంగా ఉండాలని హెచ్చరించాయి. ఇటీవల ఇస్లామిక్ స్టేట్‌ ఆ దేశంలో ఉగ్రదాడికి పాల్పడిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. 

‘భద్రతా కారణాల దృష్ట్యా సెరెనా హోటల్‌లో, దానికి దగ్గర్లో ఉన్న అమెరికన్లు వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచివెళ్లాలి’ అంటూ యూఎస్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. బ్రిటన్ ప్రభుత్వం కూడా తన దేశీయులకు ఈ తరహా హెచ్చరికే చేసింది. ‘పెరిగిన దాడుల నేపథ్యంలో మీరు హోటళ్లలో ఉండొద్దు. మరీ ముఖ్యంగా కాబుల్‌లోని సెరెనా హోటల్‌ను విడిచివెళ్లండి’ అంటూ సూచనలు చేసింది. 

కాబుల్‌లోని సెరెనా హోటల్‌కు విలాసవంతమైన హోటల్‌గా పేరుంది. ఆగస్టు నెలలో తాలిబన్లు ఆఫ్గానిస్థాన్‌ను ఆక్రమించకముందు వరకు దీనిలో విదేశీయలు సేద తీరేవారు. గతంలో తాలిబన్లు దీనిపై రెండుసార్లు దాడులకు తెగబడ్డారు. 2008లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మరణించారు. అలాగే 2014 అధ్యక్ష ఎన్నికలకు ముందు మరోసారి దాడి జరిగింది. నలుగురు యువకులు హోటల్‌లోకి చొచ్చుకెళ్లి, కాల్పులు జరపగా.. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ప్రముఖ అంతర్జాతీయ వార్త సంస్థకు చెందిన పాత్రికేయుడు, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు.  

మరోపక్క..తాలిబన్ల పాలనలోకి వెళ్లిన అఫ్గానిస్థాన్‌ ఉగ్రదాడులతో దద్దరిల్లుతోంది. గత శుక్రవారం కుందుజ్‌లోని గొజరే సయ్యద్‌ అబద్ మసీదు వద్ద షియాలు లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ ఘటనలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 150 మంది గాయపడ్డారు. ఈ ఘటన తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి, అధికారాన్ని హస్తగతం చేసుకొన్న తాలిబన్లకు ఈ ఉగ్రముఠా తలనొప్పిగా మారింది. ఇది మతపరమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని కొద్ది రోజుల వ్యవధిలోని పలుమార్లు దాడులకు తెగబడింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని