Stillbirth: డెల్టాతో గర్భస్థ శిశువుకు తప్పని ముప్పు..!

కరోనావైరస్‌ విషయంలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని తాజాగా యూఎస్‌ అధ్యయనం ఒకటి వెల్లడించింది. కొవిడ్ లేని వారితో పోలిస్తే.. ఆ మహమ్మారి బారిన పడిన గర్భిణీలు నిర్జీవ శిశువులను ప్రసవించే ప్రమాదం రెండురెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.

Published : 20 Nov 2021 16:05 IST

దిల్లీ: కరోనావైరస్‌ విషయంలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని తాజాగా యూఎస్‌ అధ్యయనం ఒకటి వెల్లడించింది. కొవిడ్ లేని వారితో పోలిస్తే.. ఆ మహమ్మారి బారిన పడిన గర్భిణీలు నిర్జీవ శిశువులను ప్రసవించే ప్రమాదం రెండురెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. అదే డెల్టా వేరియంట్ విజృంభించిన సమయంలో ఆ ముప్పు నాలుగు రెట్లు పెరిగినట్లు పేర్కొంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) మార్చి 2020 నుంచి సెప్టెంబర్ 2021 మధ్యలో జరిగిన 1.2 మిలియన్ల ప్రసవాల వివరాలను సేకరించి, విశ్లేషించింది.  వాటిలో 8,154 ప్రసవాల్లో శిశుమరణాలు సంభవించాయి. వాటిలో కూడా డెల్టా వేరియంట్ రాకముందు కోవిడ్ పాజిటివ్ వచ్చిన తల్లులకు పుట్టిన శిశువుల్లో మరణాలు తక్కువగా నమోదయ్యాయి. డెల్టా వేరియంట్ తో బాధపడుతున్న గర్భిణుల్లో మాత్రం శిశుమరణాలు అధికంగా నమోదయ్యాయి. డెల్టా వేరియంట్ వల్ల ఆ మరణాల రేటు నాలుగు రెట్లు పెరిగినట్టు ఆ అధ్యయనం వెల్లడించింది. 

డెల్టా వేరియంట్ సోకిన తల్లులు నిర్జీవ శిశువులు ప్రసవించడానికి గల కారణాలను అధ్యయనకర్తలు వివరించారు.  కరోనా వల్ల శిశువు శరీరంలో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఉండడమో లేక ప్లాసెంటాకు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడమో కారణం అయి ఉండొచ్చని అంచనావేశారు. అలాగే ఆ గర్భస్థ శిశువుల్లో అధికరక్తపోటు, గుండె సమస్యలు, సెప్సిస్, రక్త ప్రవాహం సరిగా జరగకపోవడం, ఊపిరితిత్తుల సమస్యలు వంటివి బయటపడ్డాయి. ఆ బిడ్డలని పుట్టిన వెంటనే చాలా రోజుల పాటూ వెంటిలేటర్ పై ఉంచాల్సి రావడం, ఐసీయూలో చేర్చించి చికిత్స చేయించాల్సి రావడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏది ఏమైనప్పటికీ, దీనికి సంబంధించి మరింత అధ్యయనం జరగాల్సి ఉందని వారు వెల్లడించారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని