WHO: ఒమిక్రాన్‌తో ప్రమాదం చాలా ఎక్కువగానే ఉంది..!

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భౌగోళిక ముప్పుగా పరిణమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఇది 60కి పైగా దేశాలకు వ్యాప్తి చెందినట్లు పేర్కొంది.  

Published : 14 Dec 2021 02:00 IST

జెనీవా: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భౌగోళిక ముప్పుగా పరిణమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఇది 60కి పైగా దేశాలకు వ్యాప్తి చెందినట్లు పేర్కొంది.  ఇది టీకాల నుంచి పొందుతున్న రక్షణను ఏమార్చుతున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నప్పటికీ.. వ్యాధి తీవ్రత  స్వల్పంగానే ఉందనే విషయంపై మాత్రం సమాచారం పరిమితంగానే ఉందని వెల్లడించింది.

‘అనేక కారణాలతో ఒమిక్రాన్‌తో ప్రమాదం ఎక్కువగానే ఉంది. మరో విషయం ఏంటంటే.. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, రోగ నిరోధక శక్తిని ఏమార్చుతుందని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఇది తీవ్ర పరిణామాలతో మరో విజృంభణకు దారితీయొచ్చు’ అని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అలాగే దక్షిణాఫ్రికాలో రీఇన్ఫెక్షన్ పెరుగుతున్నట్లు వెలువడిన సంకేతాలను ప్రస్తావించింది. ‘ఈ కొత్త వేరియంట్‌ వల్ల వ్యాధి తీవ్రత ఏస్థాయిలో ఉంటుందో ఒక అంచనాకు వచ్చేందుకు మరింత సమాచారం కావాల్సి ఉంది. డెల్టా కంటే వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ.. వైరస్ వేగంగా ప్రబలితే ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతుంది. దాంతో వైద్య సేవలపై భారం పెరుగుతుంది. అప్పడది మరిన్ని మరణాలకు దారితీయవచ్చు’ అని పేర్కొంది.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ను మొదట దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఈ వేరియంట్‌ను గుర్తించిన కొద్ది రోజుల్లోనే 60కి పైగా దేశాలకు వ్యాపించింది. భారత్‌లో 38 మంది ఈ వేరియంట్‌ బారినపడ్డారని కేంద్రం వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని