Published : 29/10/2021 13:44 IST

Nawab Malik: సినిమా ఇంకా అయిపోలేదు..!

బాలీవుడ్‌ను తరలించేందుకు భాజపా చేసిన కుట్ర : నవాబ్‌ మాలిక్‌

ముంబయి: క్రూయిజ్ నౌక డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టు, అప్పటినుంచి మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ చేస్తోన్న సంచలన ఆరోపణలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నిన్న బాంబే హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేయగా.. ఆ వెంటనే ‘సినిమా ఇంకా అయిపోలేదు’ అంటూ మాలిక్ ట్వీట్ చేశారు. ఈ కేసు గురించి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ముంబయి నుంచి బాలీవుడ్‌ను తరలించేందుకు భాజపా చేసిన కుట్రగా ఈ డ్రగ్స్‌ కేసును ఆయన అభివర్ణించారు.

‘ఈ క్రూయిజ్ డ్రగ్స్‌ కేసు.. ముంబయి నుంచి బాలీవుడ్‌ను తరలించేందుకు భాజపా పన్నిన పన్నాగం. బాలీవుడ్‌ను మసకబార్చేందుకు ఆ పార్టీ చేసిన కుట్ర’ అని మాలిక్ ప్రతిపక్ష భాజపాపై తీవ్రంగా మండిపడ్డారు. అలాగే సమీర్ వాంఖడేపై మరోసారి ఆరోపణలు చేశారు. ‘పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆర్యన్‌ ఖాన్‌ను ఎన్‌సీబీ కార్యాలయానికి తీసుకువచ్చిన ఆ వ్యక్తి(కిరణ్ గోసావి) ఇప్పుడు జైలు పాలయ్యారు. ఆర్యన్‌, ఇతరులకు బెయిల్ రాకుండా అన్ని ప్రయత్నాలు చేసిన వ్యక్తి (సమీర్ వాంఖడే) ఇప్పుడు కోర్టు మెట్లెక్కారు. ముంబయి పోలీసులు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించారు. తనకు రక్షణ కల్పించాలని గతవారం ముంబయి పోలీసుల్ని కోరారు. ఆయన ఏదో తప్పు చేశారు.. అందుకే ఇంతగా భయపడుతున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు. ‘నా పోరాటం వ్యక్తిగతమైంది కాదు. అన్నింటికీ సాక్ష్యాలు ఉన్నాయి’ అని అన్నారు. అంతేగాకుండా పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఎన్‌సీబీ అధికారి నుంచి తనకు ఒక లేఖ అందిందని, బాధ్యతాయుతమైన పౌరుడిగా దాన్ని పంపుతున్నట్లు ఎన్‌సీబీకి వెల్లడించారు.

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్ అరెస్టు తర్వాత అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆర్యన్ విడుదలకు అతడి తండ్రి షారుక్ ఖాన్ నుంచి రూ.25 కోట్లు డిమాండ్ చేశారని, వాటిలో రూ.8 కోట్లు వాంఖడేకు వెళ్తాయని ఈ కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మరోపక్క మంత్రి ఆ అధికారికి సంబంధించిన పలు వివరాలు నెట్టింట్లో పోస్టు చేస్తూ.. ఆరోపణల్ని తీవ్రతరం చేశారు. దాంతో ఎన్‌సీబీ వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు పై అధికారులతో సమీర్‌పై విచారణ ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. నిన్న బాంబే హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ‘సినిమా ఇంకా అయిపోలేదు’ అంటూ మాలిక్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.  

ఆర్యన్ ఈ రోజు విడుదల కావొచ్చు..‘ఈ రోజు సాయంత్రం హైకోర్టు నుంచి ఆదేశాలు అందే అవకాశం ఉంది. ఆ వెంటనే మేం వాటిని ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించనున్నాం. దాంతో ఆర్యన్ విడుదలకు కావాల్సిన ఉత్తర్వులు పొందునున్నాం’ అని ఈ కేసులో ఆర్యన్ తరఫు న్యాయవాది మీడియాకు వెల్లడించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని