Afghanistan: తాలిబన్‌ ప్రభుత్వాన్ని గుర్తించకపోవడం.. ISIS-Kకే ప్రయోజనం!

అఫ్గాన్‌లో నూతన ప్రభుత్వాన్ని గుర్తించకపోవడం ఇస్లామిక్‌ స్టేట్‌ ఖోరాసన్‌ (ISIS-K) కు ప్రయోజనం చేకూరుస్తోందని వాపోతున్నారు.

Published : 18 Oct 2021 01:34 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకొన్న తాలిబన్లు అక్కడ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండు నెలలు కావస్తోంది. అయినప్పటికీ తాలిబన్ల ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించడం లేదు. తాజాగా వీటిపై స్పందించిన తాలిబన్లు.. అఫ్గాన్‌లో నూతన ప్రభుత్వాన్ని గుర్తించకపోవడం ఇస్లామిక్‌ స్టేట్‌ ఖోరాసన్‌ (ISIS-K) కు ప్రయోజనం చేకూరుస్తోందని వాపోతున్నారు. అయినప్పటికీ అఫ్గాన్‌కు వారి నుంచి ముప్పు ఉందని వస్తున్న వాదనను మాత్రం తోసిపుచ్చారు.

అఫ్గాన్‌ విదేశీ మారక నిల్వలను అమెరికా ఫ్రీజ్‌ చేయడం.. అంతర్జాతీయ చట్టాలను, మానవ హక్కులను ఉల్లంఘించడమేనని అఫ్గాన్‌ విదేశాంగ మంత్రిగా తాలిబన్‌ ప్రతినిధి అమీర్‌ ఖాన్‌ ముత్తఖీ పేర్కొన్నారు. అసలు వాటిని ఎందుకు నిలిపివేశారని.. అఫ్గాన్‌ పౌరులు ఏం చేశారని ప్రశ్నించారు. మరోవైపు మాత్రం అఫ్గాన్‌కు అంతర్జాతీయ సహకారం అందించాలంటూ అమెరికాతో పాటు ఇతర దేశాలు మాట్లాడుతున్నాయని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవాలంటే అఫ్గాన్‌ ప్రభుత్వానికి అధికారిక గుర్తింపుతో పాటు అంతర్జాతీయ సహకారం అత్యంత కీలకమని అన్నారు. ఇలా అఫ్గాన్‌ ప్రభుత్వాన్ని గుర్తించకుండా ఒంటరిగా వదిలేయడం ఐఎస్‌ఐఎస్‌-కే ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తోందని అభిప్రాయపడ్డారు.

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అక్కడి మసీదులే లక్ష్యంగా వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. కాందహార్‌లో జరిగిన పేలుళ్లలో 47 మంది మృత్యువాతపడగా.. మరో 70 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ పేలుళ్లకు పాల్పడింది తామేనంటూ ISIS-K ప్రకటించుకుంది. అంతకుముందు కూడా అఫ్గాన్‌లో ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా పలు దాడులకు పాల్పడింది. ముఖ్యంగా షియా ముస్లింలే లక్ష్యంగా ఆ దాడులకు పాల్పడుతున్నట్లు ఐఎస్‌ఐఎస్‌-కే విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఈ వరుస దాడుల నేపథ్యంలో స్పందించిన అఫ్గాన్‌ విదేశాంగ మంత్రిగా తాలిబన్‌ ప్రతినిధి అమీర్‌ ఖాన్‌ ముత్తఖీ.. తమ ప్రభుత్వాన్ని గుర్తించకపోవడమే వారికి ఇలాంటి దాడులకు అవకాశం దొరుకుతోందన్నారు. ఇక తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశానికి అతిపెద్ద ముప్పు ఐఎస్‌ఐఎస్‌-కే అని అక్కడి మీడియాతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు పేర్కొంటున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని