Lakhimpur Kheri violence: దీన్నొక అంతులేని కథగా మార్చకండి..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్ ఖేరి ఘటనపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఆ ఘటనకు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చివరి నిమిషంలో నివేదిక సమర్పించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణను ఒక అంతులేని కథగా మార్చకండంటూ వ్యాఖ్యానించింది.

Updated : 20 Oct 2021 14:09 IST

లఖింపుర్ ఘటన విచారణలో యూపీ ప్రభుత్వ తీరుపై సుప్రీం అసహనం

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్ ఖేరి ఘటనపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఆ ఘటనకు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చివరి నిమిషంలో నివేదిక సమర్పించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణను ఒక అంతులేని కథగా మార్చకండంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

‘తెల్లవారుజామున ఒంటిగంట వరకూ నివేదిక కోసం ఎదురుచూశాం. మీరు చివరి నిమిషంలో సమర్పిస్తే.. మేమెప్పుడు దాన్ని పరిశీలించాలి? కనీసం ఒకరోజు ముందైనా సమర్పించాలి కదా!’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. లఖింపుర్ ఘటనలో యూపీ ప్రభుత్వం ఎక్కువ మంది సాక్షుల్ని ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. ‘164 మంది సాక్షుల్లో ఇప్పటివరకు మీరు 44 మందినే విచారించారు. ఇంతకంటే ఎక్కువ మందిని ఎందుకు విచారించలేకపోయారు’ అని అడిగారు. పోలీసులు వారిని ప్రశ్నిస్తే తప్ప.. ఈ విషయంపై స్పష్టత ఉండదన్నారు. ‘సాక్షులకు రక్షణ కల్పించాలి. వారి వాంగ్మూలాల్ని రికార్డు చేయాలి. ఇది ఒక అంతులేని కథలా మారకూడదు’ అని వ్యాఖ్యానించారు. ‘యూపీ ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలతో మేము సంతృప్తిగా లేం. ప్రభుత్వం, పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మేం ఆశిస్తున్నాం. ఈ కేసులో ఆరోపణలు చాలా తీవ్రమైనవి’ అని యూపీ ప్రభుత్వానికి సీజేఐ గుర్తుచేశారు.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కీలక నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, సాక్షుల్ని విచారించే ప్రక్రియ కొనసాగుతోందని హరీశ్ సాల్వే కోర్టుకు వెల్లడించారు. ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆయన యూపీ ప్రభుత్వం తరఫున వాదిస్తున్నారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతోన్న రైతులపై కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా వాహన శ్రేణి దూసుకెళ్లింది. ఆ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 11న ఆశిష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని