Corona: బ్రిటన్‌ గబ్బిలాల్లో కరోనా వైరస్‌!

కొవిడ్‌-19కు కారణమైన నావెల్‌ కరోనా వైరస్‌ రకాన్ని బ్రిటన్‌ గబ్బిలాల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు.

Published : 20 Jul 2021 22:19 IST

మానవులకు సోకే ప్రమాదం లేదన్న పరిశోధకులు

లండన్‌: యావత్‌ మానవాళిని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మూలాలపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, చైనాలో బయటపడ్డ కొవిడ్‌ మహమ్మారి తొలుత గబ్బిలాల నుంచి మానవులకు సోకిందనే వార్తలు వచ్చాయి. కానీ, దీనికి ఎటువంటి రుజువులు లభించలేదు. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19కు కారణమైన నావెల్‌ కరోనా వైరస్‌ రకాన్ని బ్రిటన్‌ గబ్బిలాల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు.

చైనాలో వెలుగు చూసిన కొవిడ్‌-19కి కారణమైన వైరస్‌ మూలాలను కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఆంగ్లియా (UEA), జువాలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ లండన్‌ (ZSL), పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ (PHE) సంస్థలు సంయుక్తంగా పరిశోధన చేపట్టాయి. ఇందుకోసం శాస్త్రవేత్తలు 50 గబ్బిలాల మలసంబంధమైన నమూనాలను సేకరించి విశ్లేషించారు. వీటికి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టగా ఒక నమూనాలో నావెల్‌ కరోనా వైరస్‌ మూలాలు ఉన్నట్లు గుర్తించారు. దీనికి ‘RhGB01’ అనే పేరు పెట్టారు. సార్స్‌కు సంబంధించిన వైరస్‌ గబ్బిలాల్లో తొలిసారి వెలుగు చూసిందని.. బ్రిటన్‌ గబ్బిలాల్లో కనిపించడం కూడా ఇదే మొదటిసారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

గబ్బిలాల్లో సార్స్‌ సంబంధిత వైరస్‌లు ఉండడం కొత్తేమి కాదని నిపుణులు చెబుతున్నారు. చాలాకాలం (వేల సంవత్సరాలు) నుంచి ఈ వైరస్‌కు కేంద్రకాలుగా గబ్బిలాలు ఉన్నాయని గుర్తుచేశారు. కేవలం ఇప్పుడు పరిశోధనలు చేయడం వల్లే వీటిని తొలిసారి గుర్తించామని చెప్పారు. అయితే, గబ్బిలాల నుంచి మానవులకు నేరుగా సోకే ప్రమాదం లేదని పరిశోధనా బృందం స్పష్టం చేసింది. వైరస్‌ మ్యుటేషన్‌ చెందితే తప్ప మానవులకు వ్యాప్తి చెందే ప్రమాదం లేదని పేర్కొంది. కొవిడ్‌ సోకిన వ్యక్తి నుంచి కరోనా వైరస్‌ గబ్బిలాలకు వ్యాపిస్తే తప్ప ఈ మ్యుటేషన్ జరిగే ఆస్కారం లేదని స్పష్టం చేసింది. అందుచేత గబ్బిలాల సంరక్షకులు పీపీఈ కిట్లు ధరించాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని