Breakthrough Covid: బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లతో పెద్దవారికి ముప్పే..!

వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి బ్రేక్‌త్రూ (Breakthrough) ఇన్‌ఫెక్షన్‌ వల్ల ముప్పేనని తాజా అధ్యయనంలో తేలింది.

Published : 09 Sep 2021 17:59 IST

సీడీసీ అధ్యయనం వెల్లడి

వాషింగ్టన్‌: కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్న తర్వాత వైరస్‌ సోకినా తీవ్ర ప్రమాదం ఏమీ ఉండదని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి బ్రేక్‌త్రూ (Breakthrough) ఇన్‌ఫెక్షన్‌ వల్ల ముప్పేనని తాజా అధ్యయనంలో తేలింది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కొవిడ్‌ బారిన పడిన ఇలాంటి వారు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం వస్తోందని అమెరికా సీడీసీ అధ్యయనం వెల్లడించింది.

కొవిడ్‌-19ను నిరోధించే వ్యాక్సిన్‌ పూర్తి మోతాదులో తీసుకున్న తర్వాత వైరస్‌ బారిన పడిన (Breakthrough) పడితే.. వాటి ప్రభావాలను అంచనా వేసేందుకు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (CDC) అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 30వ తేదీ నాటికి దాదాపు 12,908 బ్రేక్‌త్రూ కేసులను పరిగణలోకి తీసుకుంది. ఇందుకోసం వైరస్‌ బారినపడి ఆస్పత్రిలో చికిత్సపొందిన, మరణించిన వారి సమాచారాన్ని విశ్లేషించింది. ఇలా బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌ అనంతరం ఆస్పత్రిపాలైన వారిలో దాదాపు 70శాతం మంది 65ఏళ్లకు పైబడిన వారేనని సీడీసీ పేర్కొంది. అంతేకాకుండా బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌ సమస్యలతో మరణించిన వాళ్లలో దాదాపు 87శాతం మంది 65ఏళ్ల వయసు వారేనని వెల్లడైంది. ప్రస్తుతం ఈ అధ్యయనం కొనసాగుతూనే ఉందని.. అయినప్పటికీ ఇప్పటివరకు వచ్చిన అధ్యయనాల్లో కూడా ఇదే విధమైన ఫలితాలు వస్తున్నాయని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం వెల్లడించింది.

టీకా తీసుకోని వారికి ముప్పు ఎక్కువే..

ఈ అధ్యయనం కోసం అమెరికాలోని 14రాష్ట్రాల్లో దాదాపు 99 కౌంటీల్లోని వివిధ ఆస్పత్రుల్లో చేరిన కేసుల సమాచారాన్ని సీడీసీ పరిగణలోకి తీసుకుంది. బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆస్పత్రిలో చేరుతున్న వారిలో ఎక్కువగా మధుమేహం, హృద్రోగ సమస్యలు ఎదుర్కొంటున్న వారేనని సీడీసీ పేర్కొంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ విజృంభణ అధికంగా ఉన్న జూన్‌, జులై నెలల్లో నమోదైన కేసుల్లోనే 10రెట్లు ఆస్పత్రి చేరికలు పెరిగాయని వెల్లడించింది. ఇక వ్యాక్సిన్‌ తీసుకోకుండా ఉన్నవారు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యి ఆస్పత్రిలో చేరే వారి సరాసరి వయసు 59ఏళ్లుగా తెలిపింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారితో పోలిస్తే తీసుకోని వారి ఆస్పత్రి చేరికలు 17రెట్లు ఎక్కువ అని సీడీసీ స్పష్టం చేసింది. అందుకే ఇలాంటి ముప్పులను దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని