Rahul Gandhi: రెండేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌కు రాహుల్‌గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం శ్రీనగర్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు జమ్మూకశ్మీర్‌ పీసీసీ అధ్యక్షుడు

Published : 10 Aug 2021 11:20 IST

శ్రీనగర్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం శ్రీనగర్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు జమ్మూకశ్మీర్‌ పీసీసీ అధ్యక్షుడు ఘులాం అహ్మద్‌ మిర్‌ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం మధ్య కశ్మీర్‌లోని గందెర్‌బల్‌ జిల్లాలో ఉన్న ఖీర్‌ భవాని ఆలయాన్ని రాహుల్‌ దర్శించుకున్నారు. ఆయన వెంట పార్టీ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ కూడా ఉన్నారు.

పర్యటనలో భాగంగా దాల్‌ సరస్సు ఒడ్డున ఉన్న హజ్రత్‌బల్‌ దర్గాకు వెళ్లనున్నారు. అనంతరం శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ భవన్‌ను ప్రారంభించి పార్టీ నేతలు, కార్యకర్తలతో కొంతసేపు ముచ్చటించనున్నారు. తిరిగి సాయంత్రం దిల్లీ బయల్దేరనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఇది రాహుల్‌ ప్రైవేటు పర్యటన అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

కాగా.. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత నుంచి రాహుల్‌ అక్కడకు వెళ్లడం ఇదే తొలిసారి. రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదాను తొలగించిన కొన్ని రోజుల తర్వాత రాహుల్‌ నేతృత్వంలోని ప్రతిపక్షనేతల బృందం కశ్మీర్‌కు వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే అప్పటి పరిస్థితుల దృష్ట్యా పోలీసులు వీరిని అడ్డుకుని శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచే వెనక్కి పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని