Navjot Singh Sidhu: ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగిస్తున్న సిద్ధూ

పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తప్పుడు సమాచారాన్నీ

Updated : 07 Nov 2021 11:32 IST

పంజాబ్‌ అడ్వకేట్‌ జనరల్‌ ఆరోపణ

చండీగఢ్‌: పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తప్పుడు సమాచారాన్నీ వ్యాపింపజేస్తున్నారని ఆ రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఏపీఎస్‌ దేవోల్‌ ఆరోపించారు. ఏజీ కార్యాలయ విధులకూ అడ్డుపడుతున్నారని, ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారని శనివారం ధ్వజమెత్తారు. పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు సిద్ధూ ప్రకటించిన మరుసటి రోజే దేవోల్‌ ఈ విమర్శలను సంధించారు. రాజీనామాను వెనక్కి తీసుకున్నప్పటికీ అడ్వకేట్‌ జనరల్‌ పదవి నుంచి ఏపీఎస్‌ దేవోల్‌ను తొలగించే వరకు, కొత్త డీజీపీ ఎంపిక కోసం కమిటీని నియమించే వరకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోనని సిద్ధూ స్పష్టం చేశారు. రానున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు కొన్ని రాజకీయ శక్తులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని దేవోల్‌ విమర్శించడం గమనార్హం.  కాగా, 2015లో గురుగ్రంథ్‌ సాహిబ్‌ను తస్కరించి దైవద్రోహానికి పాల్పడిన వ్యక్తులకు తగిన శిక్షపడేలా చూడాలని కోరుతూ సిద్ధూ ఫరీద్‌కోట్‌లోని బుర్జ్‌ జవహర్‌సింగ్‌ వాలా గురుద్వారాలో శనివారం ప్రార్థనలు చేశారు. ఈ గురుద్వారాలోనే సిక్కుల పవిత్ర గ్రంథం ప్రతి చోరీ అయ్యింది. 

నేను పేదవాడినే.. బలహీనుడిని కాను: సీఎం

దైవద్రోహానికి పాల్పడిన వారిని శిక్షించడం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులపై చర్యల విషయంలో తన ప్రభుత్వాన్ని పదేపదే విమర్శిస్తున్న నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు ఆ రాష్ట్ర సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ గట్టిగా బదులిచ్చారు. ‘నేను పేదవాడినే కావచ్చు. నిరుపేద కుటుంబానికి చెందిన వాడినే కావచ్చు. బలహీనుడిని మాత్రం కాను. అన్ని సమస్యలూ త్వరలో పరిష్కరమవుతాయి’ అని చరణ్‌జిత్‌ సింగ్‌ శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. 2015లో దైవద్రోహానికి పాల్పడిన వారిపై విచారణ సవ్యంగానే సాగుతోందన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని