Vaccine for Pregnant: టీకా తీసుకున్న గర్భిణీల్లో తీవ్ర లక్షణాల్లేవ్‌..!

గర్భిణీలు, పాలిచ్చే తల్లుల్లో వ్యాక్సిన్‌ దుష్ర్పభావాలు స్వల్పమని.. వారిలో తీవ్ర లక్షణాలు కనిపించలేదని అమెరికాలో జరిపిన తాజా అధ్యయనంలో తేలింది.

Published : 19 Aug 2021 23:05 IST

అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం

వాషింగ్టన్‌: కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత చాలా మందిలో స్వల్ప దుష్ప్రభావాలు కనిపిస్తున్న విషయం తెలిసిందే. కొవిడ్‌ లక్షణాల మాదిరిగానే ఉండే ఈ ప్రతిస్పందనలు ఒకటి, రెండు రోజులు మాత్రమే ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే, గర్భిణీలు, పాలిచ్చే తల్లుల్లో ఇటువంటి దుష్ప్రభావాలు తక్కువేనని తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న దాదాపు 17వేల మందిపై జరిపిన అధ్యయనంలో గర్భిణీలు కానివారితో పోలిస్తే గర్భంతో ఉన్నవారు, పాలిచ్చే తల్లుల్లో వ్యాక్సిన్‌ దుష్ర్పభావాలు స్వల్పమని.. వారిలో తీవ్ర లక్షణాలు కనిపించలేదని తేలింది. తాజా అధ్యయనం జర్నల్‌ ఆఫ్‌ అమెరికా మెడికల్‌ అసోసియేషన్‌ (JAMA) నెట్‌వర్క్‌లో ప్రచురితమైంది.

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత మహిళల్లో దుష్ర్పభావాలను అంచనా వేసేందుకు అమెరికా నిపుణులు ఓ అధ్యయనం చేపట్టారు. ఇందులో పాల్గొన్న 17వేల ఐదువందల మంది గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తమ స్పందనను తెలియజేశారు. వీరిలో 44శాతం మంది గర్భిణీలు, 38శాతం మంది పాలిచ్చే మాతృమూర్తులు ఉన్నారు. వీరిలో 62శాతం మంది ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకోగా.. మిగతా వారు ఇతర టీకాలు తీసుకున్నారు. వీరు ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించగా.. గర్భిణీల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ రియాక్షన్‌లు తక్కువగానే ఉన్నట్లు గుర్తించామని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్‌ లిండా ఎక్కర్ట్‌ పేర్కొన్నారు. కేవలం ఇంజక్షన్‌ ఇచ్చిన చోట నొప్పి ఉందని 91శాతం మంది చెప్పారు. 31శాతం మంది అలసట అనిపించినట్లు చెప్పగా.. కొందరు మాత్రమే స్వల్ప జ్వరం ఉందని వివరించారు. కేవలం ఐదు నుంచి ఏడు శాతం మంది వ్యాక్సిన్‌ తర్వాత పాల లభ్యత తగ్గినట్లు గుర్తించామన్నారు.

కొవిడ్ వ్యాక్సిన్‌లు గర్భిణీలకు సురక్షితమని తెలియడంతోపాటు, వ్యాక్సిన్‌లను వారు సమర్థంగా తట్టుకోగలరనే విషయం తాజా అధ్యయనం ద్వారా మరోసారి స్పష్టమవుతోందని లిండా ఎక్కర్ట్‌ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌లపై పలు సందేహాలు నెలకొన్న వేళ ఈ అధ్యయనం ఎంతో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇతర వ్యాక్సిన్‌లను గర్భిణీలు, పాలిచ్చే తల్లులపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు మా అధ్యయనం కీలకంగా మారుతుందని లిండా ఎక్కర్ట్ వెల్లడించారు.

ఇదిలాఉంటే, భారత్‌లోనూ గర్భిణీ స్త్రీలు కరోనా వ్యాక్సిన్‌ను నిర్భయంగా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. దేశంలో అందుబాటులో ఉన్న కొవిడ్‌ టీకాలు గర్భిణులకు ఎలాంటి హాని చేయవని అధ్యయనాలు సారాంశాన్ని నొక్కి చెబుతోంది. గర్భిణీ స్త్రీలకు వైరస్‌ సోకితే వారితో పాటు గర్భంలో ఉన్న బిడ్డకు కూడా హాని కలిగే అవకాశం ఉందని పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో గర్భిణీ స్త్రీలకు టీకా పంపిణీ విధానంపై మార్గదర్శకాలు విడుదల చేసిన ఆరోగ్యశాఖ.. వారు కచ్చితంగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని