Sudan-Military Coup:  సూడాన్‌లో సైన్యం తిరుగుబాటు.. ప్రధాని అరెస్టు

అంతర్యుద్ధంతో సతమతమైన ఆఫ్రికా దేశం సూడాన్‌లో తాజాగా పరిస్థితులు మరోసారి ఆందోళనకరంగా మారాయి. అక్కడి ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన సైన్యం.. ప్రధానమంత్రితో పాటు పలువురు కీలక నేతలను నిర్బంధించింది.

Updated : 26 Oct 2021 12:15 IST

ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా, ఐరోపా సంఘాలు

కైరో: అంతర్యుద్ధంతో సతమతమైన ఆఫ్రికా దేశం సూడాన్‌లో తాజాగా పరిస్థితులు మరోసారి ఆందోళనకరంగా మారాయి. అక్కడి ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన సైన్యం.. ప్రధానమంత్రితో పాటు పలువురు కీలక నేతలను నిర్బంధించింది. అధికార బదలాయింపుపై ప్రకటన చేయకపోవడంతో ప్రధానితో పాటు ఐదుగురు కీలక మంత్రులను అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో విమాన సర్వీసులు రద్దు చేయడంతోపాటు ఇంటర్నెట్‌ సేవలను సైన్యం నిలిపివేసింది. అయితే, ప్రధానమంత్రి అబ్దల్లా హమ్‌దోక్‌ను అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఆయన ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదని అక్కడి సమాచార మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఇక స్వాతంత్ర్యం పొందిన 1956 నుంచి సూడాన్‌లో సైన్యం తిరుగుబాటు చేయడం ఇది ఎనిమిదవసారి కావడం గమనార్హం.

అధికార బదలాయింపులో తగాదాలు..

సూడాన్‌లో దాదాపు మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న అధ్యక్షుడు ఒమర్‌ అల్‌-బషీర్‌పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో సైన్యం జోక్యంతో 2019లో అల్‌-బషీర్‌ చివరకు గద్దె దిగాల్సి వచ్చింది. అనంతరం ప్రజాస్వామ్య పాలనకు అక్కడ ప్రయత్నాలు జరిగాయి. అధికారం చేపట్టేందుకు సైన్యం- ప్రజాస్వామ్యవాదుల మధ్య ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానిగా అబ్దల్లా హమ్‌దోక్‌ మూడేళ్లపాటు బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఇదే సమయంలో అధికార మార్పిడి కోసం సైన్యం, పౌర నేతల మధ్య వివాదాలు మొదలయ్యాయి. దీంతో గతనెలలో సైన్యం తిరుగుబాటు చేయాలని ప్రయత్నించినప్పటికీ అది విఫలమయ్యింది. తాజాగా ప్రధాని హమ్‌దోక్‌ను నిర్బంధించి ఆ పని పూర్తి చేసేందుకు సైన్యం పావులు కదుపుతోంది.

ప్రధాని అరెస్టుతో తిరుగుబాటు..

అధికారాన్ని అప్పగించేందుకు అనుకూలమైన ప్రకటన చేయకపోవడంతో ప్రధాని హమ్‌దోక్‌ను సైన్యం సోమవారం అరెస్టు చేసింది. సైన్యం తిరుగుబాటు ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టాలని అక్కడి అతిపెద్ద రాజకీయ పార్టీతోపాటు ప్రజాస్వామ్య అనుకూల వర్గాలు వేర్వేరుగా పిలుపునిచ్చాయి. దీంతో వేల సంఖ్యలో మద్దతుదారులు రాజధాని ఖార్తూంతోపాటు ఇతర నగరాల్లో వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జి, టియర్‌ గ్యాస్‌ను సైన్యం ప్రయోగించింది. దీంతో అక్కడ పరిస్థితులు మరోసారి ఆందోళనకరంగా మారాయి. ఆందోళనలు మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను సైన్యం నిలిపివేసింది. విమాన సర్వీసులను రద్దు చేయడంతోపాటు పలు ప్రాంతాలకు రాకపోకలు సాగించే కీలక వంతెనలను కూడా మూసివేసింది. ఇలా సూడాన్‌లో సైన్యం తిరుగుబాటు చేస్తోందంటూ వస్తోన్న వార్తలపై అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ ఆందోళన వ్యక్తం చేశాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని