Modi: ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా: మోదీ

ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారని..  వారి వల్లే దేశ ప్రజలంతా నిద్రపోగలుగుతున్నారని ప్రధాని 

Updated : 04 Nov 2021 15:31 IST

రాజౌరీ: ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారని..  వారి వల్లే దేశ ప్రజలంతా నిద్రపోగలుగుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణమని, జవాన్ల మధ్య దీపావళి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తాను ప్రధానిగా రాలేదని.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చానని సైనికులను ఉద్దేశించి అన్నారు.

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో సైనికులతో కలిసి మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ సైన్యం కోసం 130 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులు తీసుకొచ్చానని చెప్పారు. సైన్యం ధైర్య సాహసాలు దీపావళికి మరింత శోభను తెచ్చిపెట్టాయన్నారు. ప్రతి దీపావళిని సైనికుల మధ్యే జరుపుకొంటున్నానని.. ఇది చాలా ఆనందంగా ఉందని చెప్పారు. 

ఆయుధ సంపత్తితో బలోపేతం చేస్తున్నాం..

‘‘సైన్యానికి అత్యాధునిక ఆయుధ సామగ్రి సమకూరుస్తున్నాం. తేజస్‌, అర్జున్‌లాంటి ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయి. ఆయుధ సంపత్తితో సైనిక శక్తిని బలోపేతం చేస్తున్నాం. ఆయుధాలు సమకూర్చుకోవడంలోనూ స్వయం సమృద్ధి సాధిస్తున్నాం. 200కి పైగా ఆయుధాలు తయారు చేసుకుంటున్నాం. అన్ని రంగాల్లో మహిళలకు అవకాశం కల్పిస్తున్నాం. దేశ భద్రత విషయంలో మహిళల పాత్ర కీలకంగా మారుతోంది. ఇప్పటికే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మహిళలు రాణిస్తున్నారు. సైన్యంలో వారికి శాశ్వత కమిషన్‌ హోదా దక్కుతోంది. అందులోనూ మహిళలకు ప్రాధాన్యమిస్తున్నాం. సైనిక సంస్థలు వారి కోసం కొత్త బాటలు పరుస్తున్నాయి సైనిక పాఠశాలల్లో బాలికలకు అవకాశం కల్పిస్తున్నాం. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, మిలటరీ కాలేజీల్లోనూ మహిళలకు ప్రవేశం ఉంది. సైన్యం సరిహద్దుల్లోనే కాపలా కాయట్లేదు.. రాష్ట్రాలకూ రక్షణగా నిలుస్తోంది’’ అని మోదీ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని