డబ్బులు ఎరగా వేసి.. ఉగ్రవాదులుగా శిక్షణ ఇచ్చి.. మరోసారి రుజువైన పాక్‌ పన్నాగం

జమ్మూకశ్మీర్‌లో అమాయకులనే లక్ష్యంగా చేసుకుంటున్న పాకిస్థాన్‌.. ఉగ్రవాదులను భారత్‌పై ఎగదోసి దాడులు చేసే ప్రయత్నాలు మరోసారి బయటపడ్డాయి.

Published : 29 Sep 2021 23:25 IST

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో అమాయకులనే లక్ష్యంగా చేసుకుంటున్న పాకిస్థాన్‌.. ఉగ్రవాదులను భారత్‌పై ఎగదోసి దాడులు చేసే ప్రయత్నాలు మరోసారి బయటపడ్డాయి. పాకిస్థాన్‌ యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తూ వారిని భారత్‌లోకి అక్రమంగా చొరబాటుకు పాల్పడుతున్నట్లు మరోసారి రుజువయ్యింది. జమ్మూకశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో పట్టుబడిన అలీ బాబర్‌ పాత్ర అనే పాక్‌ ఉగ్రవాది ఈ సంచలన విషయాలు వెల్లడించాడు. అతడికి లష్కరే తోయిబాతోపాటు పాకిస్థాన్‌ ఆర్మీ శిక్షణ ఇచ్చినట్లు తెలిపాడు. అంతేకాకుండా బారాముల్లాలోని ఓ ప్రాంతానికి ఆయుధాలను చేరవేసేందుకు రూ.20వేలను అప్పజెప్పినట్లు వివరించాడు.

జమ్ముకశ్మీర్లోని ఉరి సెక్టార్‌లో సెప్టెంబర్‌ 28న ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టగా.. మరో పాక్‌ ఉగ్రవాదిని భారత సైన్యం సజీవంగా పట్టుకుంది. ఇలా భారత్‌లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా ఓ పాక్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి. అయితే, పట్టుబడిన ఉగ్రవాది నుంచి సమాచారం సేకరించే ప్రయత్నం భారత్‌ సైన్యం చేసింది. తనకు ముజఫరాబాద్‌లోని లష్కరే క్యాంపులో శిక్షణ ఇచ్చినట్లు పట్టుబడిన యువకుడు వెల్లడించాడు. అంతేకాకుండా తనతో సహా ఆరుగురు ఉగ్రవాదులు సెప్టెంబర్‌ 18న భారత్‌లోకి ప్రవేశించినట్లు తెలిపాడు. ఇలా అక్రమంగా ప్రవేశించి ఆయుధాలను సరఫరా చేసేందుకు కొందరు వ్యక్తులు రూ.20వేలు అందజేసినట్లు పేర్కొన్నాడు. ఆయుధ సామగ్రి చేరవేసిన తర్వాత మరో రూ.30వేలు అందిస్తామనే హామీ ఇచ్చినట్లు ఉగ్రవాది బాబర్‌ పేర్కొన్నాడు. ఈ మేరకు ఉరీలోని ఆర్మీ క్యాంపులో స్థానిక మీడియా ముందు మాట్లాడుతున్న వీడియోను ఆర్మీ అధికారులు  తాజాగా విడుదల చేశారు.

గతకొన్నేళ్లుగా భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు పెరిగినట్లు సైన్యాధికారులు వెల్లడిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కశ్మీర్‌ లోయలో దాదాపు 70 మంది వరకు పాక్‌ ఉగ్రవాదులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వీరంతా నేరుగా దాడుల్లో పాల్గొనకుండా.. స్థానికంగా ఉన్న వారిని దాడుల్లో పాల్గొనేలా రెచ్చగొట్టే వ్యూహాలు అమలు చేస్తారని చెబుతున్నారు. వీటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్న సైన్యం.. ఇలాంటి అక్రమ చొరబాటుదారులపై కన్నేసి ఉంచుతోంది. ఇక భారత్‌లో పండగ సీజన్‌లో ఉగ్రదాడులకు పాకిస్థాన్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు కూడా హెచ్చరించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని