Pak Foreign Minister: త్వరలోనే అఫ్గాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు..!

మరికొన్ని రోజుల్లోనే అఫ్గానిస్థాన్‌లో అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడుతుందని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మూద్‌ ఖురేషీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Published : 31 Aug 2021 23:25 IST

ఆశాభావం వ్యక్తం చేసిన పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి

ఇస్లామాబాద్‌: మరికొన్ని రోజుల్లోనే అఫ్గానిస్థాన్‌లో అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడుతుందని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మూద్‌ ఖురేషీ ఆశాభావం వ్యక్తం చేశారు. అఫ్గాన్‌ నుంచి అమెరికాతో పాటు వివిధ దేశాలు సైన్యాన్ని తరలించే గడువు నేటితో (ఆగస్టు 31నాటికి) ముగిసిన నేపథ్యంలో పాక్‌ మంత్రి ఈ విధంగా స్పందించారు. అయితే, అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుపై మాత్రం అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. దీనిపై తాలిబన్లు ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే అఫ్గాన్‌లో ప్రభుత్వం ఏర్పడుతుందని పాకిస్థాన్‌ వెల్లడించడం గమనార్హం.

20ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత అఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాలు పూర్తి స్థాయిలో వెళ్లిపోవడంతో తాలిబన్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే దేశం మొత్తం ఆక్రమించుకున్న తాలిబన్లు.. తాజాగా కాబుల్‌ విమానాశ్రయాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం అమెరికా బలగాలు విడిచి వెళ్లిపోయిన హెలికాప్టర్లు, విమానాలను పరిశీలిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అయితే, అఫ్గాన్‌లో దాదాపు 73 విమానాలు, హెలికాప్టర్లను వదిలి వెళ్లినప్పటికీ.. వాటి వ్యవస్థలను మాత్రం నిర్వీర్యం చేసినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. దీంతో ఆ విమానాలు ఎగరలేవని, సాయుధ వాహనాలు, రక్షణ వ్యవస్థలను కూడా ఎవరూ వినియోగించలేరని అమెరికా సైన్యం తెలిపింది.

కాబుల్‌ నుంచి కతర్‌కు జపాన్‌ ఎంబసీ..

కాబుల్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌లో ఉన్న రాయబార కార్యాలయాలతో పాటు అక్కడి పరిస్థితులపై ఆయా దేశాలు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా జపాన్‌ తన ఎంబసీని తాత్కాలికంగా అఫ్గాన్‌ నుంచి టర్కీకి మార్చింది. ప్రస్తుతం అక్కడ నుంచి కతర్‌కు మార్చే యోచనలో ఉన్నట్లు పేర్కొంది. ఇక అఫ్గాన్‌ నుంచి ఆయా దేశాలు వారి పౌరులను తరలించగా.. మరికొంత మంది అక్కడే చిక్కుకున్నట్లు వెల్లడిస్తున్నాయి. బ్రిటన్‌ ఇప్పటికే 5వేల మందిని తరలించగా.. మరో వందమందికిపైగా బ్రిటన్‌ పౌరులు అఫ్గాన్‌లోనే ఉండిపోయినట్లు తెలిపింది. అమెరికాకు చెందిన దాదాపు 200మంది పౌరులు అఫ్గాన్‌లోనే ఉన్నట్లు సమాచారం. అఫ్గాన్‌ తాజా పరిణామాలపై భారత్‌ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కీలక అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని