Vaccination: 80శాతం మందికి ఒకడోసు.. 41శాతం రెండుడోసులు పూర్తి!

వ్యాక్సిన్‌కు అర్హులైన వారిలో 80శాతం మందికి కనీసం ఒకడోసు టీకా అందించగా.. 41శాతం మందికి పూర్తి మోతాదులో (రెండు డోసులు) వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Published : 18 Nov 2021 20:13 IST

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. నిత్యం దాదాపు 70లక్షల డోసులను అందిస్తున్నారు. ఇలా దేశంలో ఇప్పటివరకు మొత్తం 115 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వ్యాక్సిన్‌కు అర్హులైన వారిలో 80శాతం మందికి కనీసం ఒకడోసు టీకా అందించగా.. 41శాతం మందికి పూర్తి మోతాదులో (రెండు డోసులు) వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు తెలిపింది.

‘రోజురోజుకు వ్యాక్సిన్‌ పంపిణీ పెంచడం ద్వారా ఇన్‌ఫెక్షన్‌ నుంచి దేశానికి పూర్తి రక్షణ కలుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 115కోట్ల డోసులను పంపిణీ చేశాం. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి టీకా అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఏదైనా చేయాలని భారతీయులు ఒకసారి తలచుకుంటే.. అసాధ్యం అంటూ ఏదీ ఉండదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, దేశంలో కనీసం ఒకడోసు తీసుకున్న వారితో పోలిస్తే పూర్తి మోతాదుల్లో (రెండు డోసులు) తీసుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇదే సమయంలో దేశంలో ఇప్పటివరకు దాదాపు 12కోట్ల మంది రెండు డోసుకు దూరంగా ఉన్నారని వెల్లడించింది. ఈనేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకోని వారిపై దృష్టిపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఇంటింటికి వెళ్లి టీకా అందించే ప్రయత్నం చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యంగా రెండోడోసు గడువు ముగిసిన వారిని గుర్తించి టీకా ఇవ్వడంతో పాటు అసలే వ్యాక్సిన్‌ తీసుకోని వారికి తొలిడోసు అందించాలని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని