Omicron Variant: డెల్టాతో పోలిస్తే ఆరు రెట్లు వేగంగా ఒమిక్రాన్‌!

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టాతో పోల్చితే ఆరురెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు.......

Updated : 30 Nov 2021 15:07 IST

దిల్లీ: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టాతో పోలిస్తే ఆరురెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టాతో పోల్చితే కొత్త వేరియంట్‌ ఆర్‌వాల్యూ ఎక్కువంటున్న నిపుణులు.. మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ, కాక్ టెయిల్ చికిత్సలకు సైతం లొంగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్‌ కేసులు మొదట వెలుగుచూసిన దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో నిర్వహించిన ప్రాథమిక విశ్లేషణ ఆధారంగా.. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు.

కొవిడ్‌ రెండో దశ సమయంలో దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ పెను విషాదాన్ని మిగిల్చింది. భారీ సంఖ్యలో కేసులు, మరణాలకు కారణమైంది. అయినప్పటికీ మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్సకు డెల్టా స్పందించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత వెలుగుచూసిన డెల్టా ప్లస్‌ ఈ చికిత్సకు స్పందించలేదన్న నిపుణులు.. ఇదే తరహాలో ఒమిక్రాన్‌ సైతం ఈ థెరపీకి స్పందించడంలేదని వివరిస్తున్నారు. టీకాలు తీసుకున్నప్పటికీ ఈ వేరియంట్‌తో ప్రమాదం పొంచి ఉందని.. జాగ్రత్తలు పాటించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.

తాజా వేరియంట్‌లో ఉన్న జీ 339డి, ఎస్‌373పి, జి496ఎస్‌, క్యూ498ఆర్‌, వై505హెచ్‌ స్పైక్‌ ప్రొటీన్లు మోనోక్లోనల్‌ యాంటీ బాడీలను తట్టుకోగలవని జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయోలజీ(ఐజీఐబీ)లో రీసెర్చ్‌ స్కాలర్‌గా ఉన్న మెర్సీ రోఫినా వెల్లడించారు. ఎటెసివిమాబ్‌, బామ్లానివిమాబ్‌, కసిరివిమాబ్‌, ఇండివిమాబ్‌ ఔషధాలతోపాటు కాక్‌టెయిళ్లను కూడా ఒమిక్రాన్‌ తట్టుకుంటోందని రోఫినా తెలిపారు. ఒమిక్రాంట్‌తో వ్యాధి తీవ్రత ఎంత ఉంటుందనే అంశంపై ఇంకా స్పష్టత లేనప్పటికీ.. వైరస్‌ ప్రబలుతున్న తీరుపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దఎత్తున జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తున్నారు.

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు