Norovirus: కేరళలో మరో వైరస్‌.. 13 మందికి ‘నోరో’

పులి మీద పుట్రలా.. కేరళలో మరో వైరస్‌ కలకలం రేపింది. ఇప్పటికే కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతుండగా.. ఇటీవల నిపా వైరస్‌ కూడా ఆందోళన రేకెత్తించిన సంగతి తెలిసిందే.

Updated : 13 Nov 2021 06:54 IST

తిరువనంతపురం: పులి మీద పుట్రలా.. కేరళలో మరో వైరస్‌ కలకలం రేపింది. ఇప్పటికే కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతుండగా.. ఇటీవల నిపా వైరస్‌ కూడా ఆందోళన రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో అరుదైన నోరో వైరస్‌ కేసులు బయటపడ్డాయి. వయనాడ్‌ జిల్లా పోకోడ్‌లోని ఓ పశువైద్య కళాశాలకు చెందిన 13 మంది విద్యార్థులు దీనిబారిన పడ్డారు. కళాశాల ప్రాంగణం బయట.. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల్లో తొలుత ఈ వైరస్‌ బయట పడినట్లు అధికారులు తెలిపారు. అనంతరం శాంపిళ్లను అలప్పుజాలోని జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్‌ఐవీ)కు పంపించగా పలువురిలో నోరో వైరస్‌ బయటపడినట్లు చెప్పారు. చాలా సులువుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ఈ వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. మరోవైపు నోరోవైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సంబంధిత పశువైద్య కళాశాల విద్యార్థుల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. వారికి ప్రత్యేక అవగాహన తరగతిని కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి శుక్రవారం అధికారులతో సమావేశమై వయనాడ్‌లో పరిస్థితిని సమీక్షించారు. తాగునీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, బాధితులకు తగిన చికిత్స అందించడం వంటి చర్యల ద్వారా వ్యాధి త్వరలోనే అదుపులోకి వస్తుందని అధికారులు తెలిపారు.

లక్షణాలు: అమెరికాలోని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సమాచారం ప్రకారం.. నోరో వైరస్‌ బారినపడిన వారికి వాంతులు కావడం, డయేరియా, వికారం, కడుపునొప్పి వంటి లక్షణాలుంటాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు కూడా ఉండొచ్చు.

వ్యాప్తి: వైరస్‌ బారిన పడిన వారితో సన్నిహితంగా మెలగడం; కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం; వైరస్‌ ఉన్న ఉపరితలాలను తాకిన చేతులను (శుభ్రం చేసుకోకుండా) నోటిలో పెట్టడం వంటివాటి ద్వారా ‘నోరో’ వ్యాప్తి చెందుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని