Constitution Day: ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి

నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలోని పార్లమెంట్‌ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్, కేంద్రమంత్రులు తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులు మీదుగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు.

Updated : 26 Nov 2021 16:23 IST

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ

దిల్లీ: నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలోని పార్లమెంట్‌ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్, కేంద్రమంత్రులు తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులు మీదుగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు.

‘ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున ఈ సభకు సెల్యూట్ చేస్తున్నాం. ఇక్కడే భారత్‌కు చెందిన నేతలు మనకు రాజ్యాంగాన్ని అందించేందుకు కృషి చేశారు.  భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన ప్రతిఒక్కరికీ ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. విభిన్న సంస్కృతులతో అలరారుతున్న భారత్‌ను ఈ రాజ్యాంగం ఒక్కటిగా పట్టి ఉంచుతుంది. అంబేడ్కర్ దేశానికి రాజ్యాంగాన్ని కానుకగా ఇచ్చారు. రాజ్యాంగ దినోత్సవం ప్రారంభించినప్పుడు చాలా మంది ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడటం చాలా కష్టం. పార్టీలు కుటుంబాల పరం అవుతున్నాయి. కుటుంబాలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడలేవు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవినీతిని రాజ్యాంగం అనుమతించదు. ఇదే రోజున ముంబయి మారణహోమం జరిగింది. ఉగ్రమూకలతో పోరాడే క్రమంలో ప్రాణాలు అర్పించిన సైనికులకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను’ అంటూ ప్రధాని వెల్లడించారు.

విపక్షాలు దూరం..

కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్‌తో సహా 14 విపక్ష పార్టీలు ఈ రాజ్యాంగ దినోత్సవానికి గైర్హాజరయ్యాయి. వచ్చే వారం పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పార్టీలు ఐక్యత చాటాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు. వారు రాజ్యాంగం ప్రకారం పాలించడం లేదు. కానీ వారు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలంటున్నారు. ఇదొక ప్రచార కార్యక్రమం’ అని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని