Published : 22/07/2021 17:25 IST

corona pandemic: సారీ.. వైఫల్యానికి బాధ్యత మాదే..!

కొవిడ్ కట్టడి చర్యలపై విమర్శలు.. దేశాధినేతల క్షమాపణలు

ఇంటర్నెట్‌డెస్క్‌: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడిని అన్ని దేశాలు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వ్యాప్తిని అరికట్టేలా కఠినమైన ఆంక్షలు, కరోనాను నిరోధించే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే వైరస్ మాత్రం అదుపులోకి రావడం లేదు సరికదా.. రూపాంతరాలు చెందుతూ విరుచుకుపడుతూనే ఉంది. దీంతో ప్రభుత్వాల చర్యలపై విమర్శలు ఎదురవుతున్న వేళ.. కొందరు దేశాధినేతలు వాటికి తలొగ్గక తప్పట్లేదు. టీకా పంపిణీలో లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైనందుకు గానూ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ తాజాగా ప్రజలకు క్షమాపణలు చెప్పారు. 

గతేడాది మహమ్మారి కట్టడిలో విజయవంతమైన ఆస్ట్రేలియా ఇటీవల మాత్రం మళ్లీ మాత్రం వైరస్‌ ఉద్ధృతితో సతమతమవుతోంది. సిడ్నీ సహా చాలా నగరాల్లో కొత్త కేసులు పెరుగుతుండటంతో మరోసారి లాక్‌డౌన్ విధించాల్సి వచ్చింది. అయితే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆశించినంత వేగంగా లేకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఇప్పటివరకూ కేవలం 12శాతం మంది మాత్రం రెండు డోసులు తీసుకున్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. టీకాల కొరత కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై తాజాగా ఆసీస్‌ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ స్పందిస్తూ ప్రజలకు క్షమాపణలు తెలియజేశారు. ‘‘టీకా పంపిణీలో పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. ఇందుకు పూర్తి బాధ్యత నాదే. దీనికి నేను క్షమాపణలు చెప్పాలి. చెబుతున్నాను కూడా. కరోనా వల్ల ఎదురైన సవాళ్లకు కూడా బాధ్యత నాదే. అయితే కొన్ని మన నియంత్రణలో ఉంటాయి. కొన్ని ఉండకపోవచ్చు’’ అని మారిసన్‌ ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు. స్కాట్‌ మారిసన్‌ మాత్రమే కాదు.. కొవిడ్‌ నియంత్రణ చర్యల పట్ల వచ్చిన విమర్శలకు స్పందిస్తూ ఇటీవల పలు దేశాధినేతలు కూడా బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. 

విమర్శలను స్వీకరిస్తున్నా: బోరిస్‌

కరోనా కట్టడి కోసం విధించిన నిబంధనలను ప్రభుత్వ అధికారులే పాటించడం లేదంటూ ఇటీవల యూకేలో ప్రతిపక్ష ఎంపీ తమన్‌జీత్‌సింగ్‌ దేశీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సర్కారుపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌ వేదికగా ప్రధానిని దుయ్యబట్టారు. ఆయన వ్యాఖ్యలకు బోరిస్‌ స్పందిస్తూ.. ‘‘కరోనా వల్ల దేశ ప్రజలకు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, బాధలకు నేను క్షమాపణలు చెబుతున్నా. ప్రతిపక్ష ఎంపీ విమర్శలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. జరిగిన దానికి క్షమాపణలు’’ అని చెప్పుకొచ్చారు. 

మా నిర్ణయం తప్పే: డచ్‌ ప్రధాని

నెదర్లాండ్స్‌లో కొద్ది రోజుల క్రితం కరోనా ఆంక్షలను సవరించారు. దీంతో ఒక్కసారిగా వైరస్‌ వ్యాప్తి పెరగడమేగాక, అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ నిర్ణయం వల్లే కేసులు పెరిగాయంటూ ఆరోగ్య సిబ్బంది నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో కేవలం రెండు వారాలకే మళ్లీ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. ఆ సమయంలో డచ్‌ ప్రధాని మార్క్‌ రూట్‌ మాట్లాడుతూ.. తాము తప్పుడు నిర్ణయం తీసుకున్నామని అంగీకరించారు. ‘‘మేం సాధ్యమవుతుందని అనుకున్నది.. అసాధ్యమని ఆచరణలో తేలింది. మేం పేలవమైన నిర్ణయం తీసుకున్నాం. అందుకు చింతిస్తున్నాం. ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా’’ అని ప్రకటన చేశారు. 

దక్షిణకొరియా ప్రధాని కూడా..

దక్షిణకొరియా ప్రధాని కిమ్‌ బూ కుమ్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆఫ్రికా సముద్ర జలాల్లో పెట్రోలింగ్‌ చేస్తోన్న  ఓ నేవీ డిస్ట్రాయర్‌లో సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఆ నౌకలో మొత్తం 300 మంది ఉంటే దాదాపు 250 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. విదేశాల్లో దేశం తరఫున సేవలందిస్తున్న జవాన్లను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు దుయ్యబట్టారు. దీనికి బాధ్యత వహిస్తూ కిమ్‌ బూ ఓ ప్రకటన చేశారు. ‘‘దేశ కోసం పనిచేస్తోన్న జవాన్ల ఆరోగ్యాన్ని సంరక్షించడంతో విఫలమైనందుకు గానూ క్షమాపణలు చెబుతున్నా’’ అని వెల్లడించారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని