Published : 27/08/2021 21:18 IST

Covid hit Kerala: కేరళలో మహమ్మారి విజృంభణకు కారణాలివేనా..!

రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోందంటే..

తిరువనంతపురం: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి కాస్త అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ కేరళలో మాత్రం విలయతాండవం చేస్తోంది. దేశంలో రోజువారీగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు 70శాతం కేసులు ఒక్క కేరళలోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొవిడ్ సంక్రమణ వ్యాప్తి ఇళ్లలోనే ఎక్కువగా ఉంటున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటితో పాటు ప్రజలు కొవిడ్ నిబంధనలను నిర్లక్ష్యం చేయడం, వైరస్‌ ముప్పు ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉండడం వంటివి వైరస్‌ విజృంభణకు కారణాలుగా పేర్కొంటున్నారు. అయితే, మహమ్మారి పోరులో దేశానికే ఆదర్శంగా నిలిచిన కేరళ.. ప్రస్తుతం వైరస్‌ నియంత్రణలో మాత్రం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది.

కుటుంబ సభ్యుల వల్లే 30శాతం సంక్రమణ..

రాష్ట్రంలో కొవిడ్‌ తీవ్రతపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేపడుతూనే ఉన్నామని కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా 35శాతం కేసులు వారి ఇళ్లలోనే సంక్రమిస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలినట్లు ప్రకటించింది. ‘ఇంటిలో వైరస్‌ బారినపడిన ఓ వ్యక్తి కారణంగా ఆ ఇంటిలోని వారందరికీ వైరస్‌ సోకుతోంది. హోం క్వారంటైన్‌ నిబంధన కఠినంగా పాటించకపోవడం వల్లే అందరికీ వ్యాపిస్తోంది. అందుచేత వైరస్‌ సోకిన వారు సాధ్యమైనంత వరకూ ప్రత్యేకంగా ఉండాలి. బాధితులు వాడిన వస్తువులు ఇంట్లోని వారు వాడకూడదు. వైరస్‌ సోకిన బాధితుడు ఇంటిలో ప్రత్యేకంగా ఉండే సౌలభ్యం లేకుంటే.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు వెళ్లాలి’ అని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత పెరగడానికి ఇది ప్రధాన కారణంగా భావిస్తున్నామని చెప్పారు.

19శాతం పాజిటివిటీ రేటు..

దేశంలో కొవిడ్‌ మహమ్మారి మూడో ముప్పు పొంచి ఉందని ఇప్పటికే పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో వైరస్‌ విస్తృతి మరింత కలవరపెడుతోంది. ఇందుకు కారణాలను అన్వేషిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో సగానికంటే తక్కువ జనాభాలో మాత్రమే యాంటీబాడీలు వృద్ధిచెందాయని చెబుతోంది. అందుచేత మరింత మంది కొవిడ్‌ బారినపడే అవకాశం ఉండడం కూడా వైరస్‌ సంక్రమణ పెరగడానికి కారణంగా పేర్కొంటోంది. అంతేకాకుండా నిత్యం లక్షన్నర మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని తద్వారా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 19శాతానికి పైగా కొనసాగుతోందని కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే, వీటితో పాటు ఇటీవల (ఆగస్టు 21న) జరిగిన ఓనమ్‌ ఉత్సవాలు కూడా వైరస్‌ సంక్రమణ పెరగడానికి మరో కారణంగా ఆరోగ్యరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇక కేరళలో నిత్యం 30వేలకుపైగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా రోజువారీగా 45వేల కేసులు నమోదవుతుండగా వాటిలో కేవలం ఒక్క కేరళలోనే 30వేల పైచిలుకు కేసులు ఉంటున్నాయి. అయితే, మరణాల సంఖ్యతో పాటు ఆస్పత్రుల్లో చేరికల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంటోందని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు కట్టడి చర్యలతో పాటు వ్యాక్సినేషన్‌ను కూడా వేగవంతం చేశామని పేర్కొంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని