Schools Reopen: పాఠశాలల పునఃప్రారంభంపై IMA ఏమన్నదంటే..!

కొవిడ్‌ విజృంభణ సమయంలోనూ పాఠశాలలు తిరిగి తెరవాలని చాలా రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాన్ని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (IMA) స్వాగతించింది.

Published : 31 Aug 2021 21:47 IST

దిల్లీ: కొవిడ్‌ విజృంభణ సమయంలోనూ పాఠశాలలు తిరిగి తెరవాలని చాలా రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాన్ని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (IMA) స్వాగతించింది. ఏవైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే తప్ప.. కొవిడ్‌ ప్రమాదం అతి తక్కువేనని అభిప్రాయపడింది. పాఠశాలలు తిరిగి తెరవడం నిజంగా సానుకూల నిర్ణయమేనన్న ఐఎంఏ, ఈ క్రమంలో కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు మాత్రం తీసుకోవాలని సూచించింది.

గతకొన్ని వారాలుగా దేశంలో నిత్యం పాజిటివ్‌ కేసుల సంఖ్య 50వేలకు తక్కువగానే ఉంటోంది. ఈ సమయంలో ప్రభుత్వం ముందుకు వచ్చి.. రాబోయే ప్రమాదాన్ని అంచనా వేస్తూనే పాఠశాలలు తెరిచే ప్రయత్నం చేయవచ్చని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ జేఏ జయలాల్‌ పేర్కొన్నారు. పాఠశాలలు తెరవాలనే నిర్ణయం కాస్త క్లిష్టమైనదే అయినప్పటికీ.. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ముందుకు వెళ్లవచ్చన్నారు. ముఖ్యంగా ప్రతి తరగతిలో 20 నుంచి 30 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా జాగ్రత్తపడాలని సూచించారు. ఉపాధ్యాయులు, సిబ్బందికి తప్పనిసరిగా వ్యాక్సిన్‌లు అందించాలని అన్నారు. అయితే, ప్రస్తుతం చేస్తోన్న ప్రయత్నాలు నిజంగా ప్రయోగమనే చెప్పవచ్చని ఐఎంఏ అధ్యక్షుడు పేర్కొన్నారు.

పాఠశాలలు తిరిగి ప్రారంభించిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల సంఖ్యను అధ్యయనం చేస్తున్నామని ఐఎంఏ అధ్యక్షుడు జయపాల్‌ పేర్కొన్నారు. పాఠశాలలు తెరవగానే కొవిడ్‌ తీవ్రత పెరుగుతున్నట్లు ఇప్పటివరకు ఎక్కడా తేలలేదని చెప్పారు. పంజాబ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు పెరగడం, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో పాఠశాలలు తిరిగి తెరిచిన తర్వాత కేసుల సంఖ్య తగ్గడాన్ని గమనించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని