Afghan Operation: కాబుల్‌లో దిగిన భారత వాయుసేన విమానం..!

అఫ్గాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. అక్కడ ఉండిపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత వాయుసేనకు చెందిన C-17 విమానం ఈ సాయంత్రం కాబుల్‌ విమానాశ్రయంలో దిగింది.

Published : 16 Aug 2021 22:32 IST

భారతీయులను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం

కాబుల్‌: అఫ్గాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. కాబుల్‌లో ఉండిపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం భారత వాయుసేనకు చెందిన C-17 విమానం ఈ సాయంత్రం కాబుల్‌ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానం సోమవారం ఉదయమే కాబుల్‌ చేరుకోవాల్సి ఉన్నప్పటికీ అక్కడి విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో తజకిస్థాన్‌లో దిగాల్సి వచ్చింది. అనంతరం అమెరికా బలగాలు కాబుల్‌ విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత భారత వాయుసేన విమానం అక్కడ దిగినట్లు సమాచారం.

తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత.. అక్కడి ప్రజల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. దీంతో భారీ సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్న అఫ్గానీయులు.. కనిపించిన విమానం వెంట పరుగులు తీస్తున్నారు. వీరిని అదుపుచేసేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. కాబుల్‌ ఎయిర్‌పోర్టులో ఇలాంటి గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో భారత్‌కు చెందిన పౌరులు, రాయబార కార్యాలయ సిబ్బందితో పాటు కొంతమంది ఐటీబీపీ సిబ్బంది కూడా అక్కడే చిక్కుపోయారు. ఇలా దాదాపు 200మందికిపైగా భారతీయులు అక్కడ ఉన్నట్లు తెలుస్తుండగా.. ఈ సంఖ్య 500వరకూ ఉంటుందని మరికొన్ని వార్తా సంస్థలు అంచనా వేస్తున్నాయి. వీరందరినీ స్వదేశానికి తరలించేందుకు బయలుదేరిన ఐఏఎఫ్‌ విమానం.. కాబుల్‌ నుంచి భారత్‌ తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.

ఇదిలాఉంటే, అఫ్గాన్‌లో చిక్కుకుపోయిన మరింత మంది భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు సోమవారం సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక ఆపరేషన్‌ కోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని