Third Wave: ఈ 100 రోజులు అత్యంత కీలకం!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా థర్డ్‌వేవ్‌ ప్రారంభమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించిన నేపథ్యంలో.. రానున్న 100రోజులు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Published : 17 Jul 2021 01:08 IST

స్పష్టంచేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా థర్డ్‌వేవ్‌ ప్రారంభమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించిన నేపథ్యంలో.. రానున్న 100 రోజులు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. చాలా దేశాల్లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని హెచ్చరించింది. యావత్‌ ప్రపంచం మూడో ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోన్న వేళ.. భారతీయులు బాధ్యతగా వ్యవహరించి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది.

‘ప్రపంచ దేశాలు థర్డ్‌వేవ్‌ వైపు వెళుతున్నాయి. ఉత్తర, దక్షిణ అమెరికాలు తప్పితే మిగతా ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. అందుచేత దీన్ని హెచ్చరిక (రెడ్‌ ఫ్లాగ్‌)గా భావించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సూచించారు. ముఖ్యంగా థర్డ్‌వేవ్‌ను ఆపాలనే లక్ష్యాన్ని మాకు నిర్దేశించారు. ఇది వాస్తవంగా సాధ్యమైనదే’ అని నీతి ఆయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వీకే పాల్‌ పేర్కొన్నారు. స్పెయిన్‌లో కరోనా వైరస్‌ వారపు కేసుల్లో 64 శాతం, నెదర్లాండ్‌లో 300శాతం పెరిగాయి. థాయిలాండ్‌లో చాలా రోజులుగా పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నప్పటికీ తాజాగా అక్కడ మరోసారి వైరస్‌ ఉద్ధృతి పెరిగింది. ఆఫ్రికాలోనూ పాజిటివ్‌ కేసుల్లో 50 శాతం పెరుగుదల కనిపిస్తోంది. మయన్మార్‌, బంగ్లాదేశ్, మలేసియా, ఇండోనేసియా దేశాల్లో ఊహించని విధంగా వైరస్‌ తీవ్రత పెరుగుతోందని వీకే పాల్‌ గుర్తుచేశారు.

హెర్డ్‌ ఇమ్యూనిటీకి చాలా దూరం..

‘దేశంలో చాలా మందికి వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదు. ఇన్‌ఫెక్షన్‌ నుంచి కూడా మనం ఇంకా హెర్డ్‌ ఇమ్యూనిటీ పొందలేదు. వ్యాక్సినేషన్‌ ద్వారానే దీన్ని పొందాల్సి ఉంది. కనీసం 50 శాతం మందికి టీకాలు ఇవ్వడం ద్వారా ఇది సాధ్యం కావచ్చు. అయినప్పటికీ ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ఇదే పరిస్థితిని మున్ముందు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా వచ్చే 100 రోజులు అత్యంత కీలకం’ అని వీకే పాల్‌ స్పష్టం చేశారు. అయితే, థర్డ్‌వేవ్‌ ప్రారంభమయ్యిందా లేదా అనేది ముఖ్యం కాదని.. వైరస్‌ను ఏమేరకు ఎదుర్కొంటున్నామన్నదే ముఖ్యమని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

ఏ దేశంలోనూ మహమ్మారి ముగింపునకు రాలేదని.. కొత్త, ప్రమాదకరమైన వేరియంట్లు వైరస్ ఉద్ధృతికి దోహదం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో వాటిని నియంత్రించడం కూడా సవాలుగా మారొచ్చని ప్రపంచ దేశాలకు హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని