Covid-19 Effect: కోలుకున్న వారిలో.. ఏడాది తర్వాత లక్షణాలు ఉంటాయా..?

కొవిడ్‌ తీవ్రతతో ఆస్పత్రిలో చికిత్సపొంది.. కోలుకున్న సగం మందిలో కనీసం ఒక లక్షణమైనా ఏడాది తర్వాత కూడా వేధిస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Published : 27 Aug 2021 22:21 IST

లాన్సెట్‌ జర్నల్‌లో తాజా అధ్యయనం

బీజింగ్‌: కరోనా వైరస్‌ బారినపడి కోలుకున్న తర్వాత ఎలాంటి ప్రభావాలు ఉంటాయనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా కొవిడ్‌ తీవ్రతతో ఆస్పత్రిలో చికిత్స పొంది.. కోలుకున్న సగం మందిలో కనీసం ఒక లక్షణమైనా ఏడాది తర్వాత కూడా వేధిస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా మహమ్మారికి పుట్టినిల్లైన వుహాన్‌లో జరిపిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. వీటిని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ది లాన్సెట్‌ ప్రచురించింది.

కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత వాటి ప్రభావాన్ని అంచనా వేసేందుకు మొట్టమొదటగా కొవిడ్‌-19 వెలుగు చూసిన చైనాలోని వుహాన్‌లో అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా గతేడాది (2020) జనవరి 7 నుంచి మే 29 మధ్యకాలంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 1276 మంది రోగులను పరిగణనలోకి తీసుకున్నారు. ముఖ్యంగా కోలుకున్న 6 నుంచి 12 నెలల మధ్య కాలంలో బాధితుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. వారి ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు బాధితులనే నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం, భౌతిక పరీక్షలు, ల్యాబ్‌ టెస్టులతో పాటు ఆరు నిమిషాల నడక వంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రతిముగ్గురిలో ఒకరికి ఏడాది తర్వాత కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. కొవిడ్‌తో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకున్న బాధితుల్లో ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువ కాలం కొనసాగుతున్నట్లు కనుగొన్నారు.

ఆరు నెలల పాటు అలసట లేదా నరాల బలహీనత వంటి సమస్యలు చాలా మందిలో కనిపించాయని నిపుణులు పేర్కొన్నారు. ఇలా కనీసం ఒక లక్షణంతో బాధపడిన వారి సంఖ్య ఆరు నెలల సమయంలో 68శాతం ఉండగా.. ఏడాది నాటికి 49శాతానికి తగ్గినట్లు తెలుసుకున్నారు. అంతేకాకుండా సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే.. కొవిడ్‌ను జయించిన వారు కాస్త తక్కువ ఆరోగ్యంగా ఉంటున్నట్లూ తాజా అధ్యయనంలో నిపుణులు తేల్చారు.

‘కొవిడ్‌-19తో ఆస్పత్రుల్లో చేరి కోలుకున్న ఏడాది తర్వాత వారిపై వైరస్‌ ప్రభావాలు ఎలా ఉంటాయని అంచనా వేసేందుకు అధ్యయనం చేపట్టాం. ఇప్పటివరకూ ఇలాంటి అధ్యయనాల్లో ఇదే అతిపెద్దది’ అని చైనా-జపాన్‌ ఫ్రెండ్‌షిప్‌ ఆస్పత్రికి చెందిన ప్రొఫెసర్‌ బిన్‌ కయో పేర్కొన్నారు. చాలా మంది పూర్తిగా కోలుకున్నారని.. ఆస్పత్రిలో చేరిన సమయంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న వారిలోనే ప్రస్తుతం ఆరోగ్య సమస్యలు కొనసాగుతున్నాయని అన్నారు. కొవిడ్‌ నుంచి కోలుకునేందుకు కొందరికి ఏడాది కంటే ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశాలున్నాయనే విషయం తాజా అధ్యయనం తెలియజేస్తోందని డాక్టర్‌ బిన్‌ కయో అభిప్రాయపడ్డారు.

అంతకుముందు కొవిడ్‌ తదనంతర ప్రభావాలపై ఇదే బృందం పరిశోధన జరిపింది. 1733 మందిపై జరిపిన అధ్యయనంలో.. మూడోవంతు మందిలో ఇన్‌ఫెక్షన్‌ సోకిన ఆరు నెలల తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు గుర్తించింది. అయితే, ఈ అధ్యయనానికి కొన్ని పరిమితులు ఉన్నాయని.. దీన్ని కేవలం ఒక్క ఆస్పత్రిలో మాత్రమే చేపట్టినట్లు నిపుణులు గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని