Rahul Gandhi: చైనాపై భారత్‌కు సరైన వ్యూహం లేదు : రాహుల్‌

చైనాను ఎదుర్కొనే విషయంలో సరైన వ్యూహం లేని కారణంగా జాతీయ భద్రత విషయంలో భారత్‌ క్షమించరాని విధంగా రాజీ పడుతోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

Published : 13 Nov 2021 01:02 IST

జాతీయ భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడుతోందన్న కాంగ్రెస్‌ నేత

దిల్లీ: చైనాను ఎదుర్కొనే విషయంలో సరైన వ్యూహం లేని కారణంగా జాతీయ భద్రత విషయంలో భారత్‌ క్షమించరాని విధంగా రాజీ పడుతోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ముఖ్యంగా చైనా సరిహద్దు అంశంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (CDS) విరుద్ధ ప్రకటనలు చేయాడాన్ని ఆయన తప్పుబట్టారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా ఆక్రమణలపై అమెరికా రక్షణశాఖ నివేదికపై మీడియాలో వచ్చిన కథనాలను రాహుల్‌ ప్రస్తావించారు.

‘జాతీయ భద్రతపై భారత ప్రభుత్వం రాజీ పడుతోంది. చైనాను ఎదుర్కొనేందుకు కేంద్రం వద్ద ఎటువంటి వ్యూహం లేదు. చైనాకు Mr 56 (56 అంగుళాల ఛాతి) భయపడుతున్నారు’ అంటూ ప్రధాని మోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో తీవ్ర విమర్శలు చేశారు. ఇలా కేంద్ర ప్రభుత్వం అవాస్తవాలు చెబుతున్న నేపథ్యంలో ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దులను కంటికిరెప్పలా కాపాడుతోన్న సైనికులకు సంఘీభావం తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఇక భారత భూభాగంలోకి చైనా అక్రమంగా ప్రవేశించి కొత్త గ్రామాన్ని నిర్మిస్తోందని అమెరికా రక్షణశాఖ నివేదికలోని అంశాలు అవాస్తవమని భారత త్రివిద దళాధిపతి (CDS) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఈ మధ్యే స్పష్టం చేసిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఈ విధంగా స్పందించారు. వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి వెలసిన గ్రామం ఇటీవలి కాలంలో నిర్మించినది కాదని.. అలాంటి గ్రామాలన్నీ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా పరిధిలోనే నిర్మించుకున్నారని జనరల్‌ బిపిన్‌ రావత్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇదే సమయంలో అమెరికా నివేదికపై స్పందించిన భారత విదేశీ వ్యవహారాలశాఖ.. భారత్‌ భూభాగంలో చైనా ఆక్రమణలను గానీ, ఆ దేశ అసంబద్ధమైన వాదనలను గానీ ఎన్నడూ ఆమోదించలేదని స్పష్టం చేసింది. ‘దశాబ్దాల క్రితం ఆక్రమించిన ప్రాంతాలతో పాటు సరిహద్దుల్లో చైనా కొన్నేళ్లుగా నిర్మాణ కార్యకలాపాలు చేపట్టింది. అయితే ఆ దేశ ఆక్రమణలను, వాదనలను భారత్‌ ఎప్పుడూ ఆమోదించలేదు’ అని పేర్కొంది. దేశ భద్రతపై ప్రభావం చూపే పరిణామాలపై ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతోందని.. దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని విదేశాంగ శాఖ ఉద్ఘాటించింది.

అయితే, ఇలా చైనా ఆక్రమణలపై వచ్చిన నివేదికలపై భారత త్రిదళాధిపతి, విదేశాంగశాఖ భిన్న ప్రకటనలు చేయడంపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడుతోంది. జాతీయ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక వ్యూహం లేకపోవడం వల్లే ఇలాంటి వివాదాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు