Covovax: 5 కోట్ల డోసుల ఎగుమతికి కేంద్రం అనుమతి!

అమెరికా సంస్థ నొవావాక్స్‌(కొవొవాక్స్‌) టీకాను భారీగా ఉత్పత్తి చేస్తోంది. తాజాగా ఈ టీకా 5 కోట్ల డోసులను ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Published : 15 Nov 2021 22:48 IST

ఇండోనేసియాకు అందించనున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌

దిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే టీకా ఉత్పత్తి భారత్‌లో గణనీయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ తయారీలో ప్రపంచంలోనే ముందున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌.. వివిధ దేశాలకు చెందిన టీకాలను కూడా ఇక్కడే తయారు చేస్తోంది. ఇదే సమయంలో అమెరికా సంస్థ నొవావాక్స్‌(కొవొవాక్స్‌) టీకాను భారీగా ఉత్పత్తి చేస్తోంది. తాజాగా ఈ టీకా 5 కోట్ల డోసులను ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, భారీ స్థాయిలో ఇక్కడ తయారవుతున్నప్పటికీ కొవొవాక్స్‌ టీకాను భారత్‌లో వినియోగించేందుకు మాత్రం ఇంకా అనుమతి రాలేదు.

అమెరికా సంస్థ నోవావాక్స్‌ తయారు చేసిన కరోనా టీకాను భారత్‌లో కొవొవాక్స్‌ పేరుతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తోంది. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో ఈ టీకా దాదాపు 90శాతం సమర్థత చూపించినట్లు అమెరికాలో జరిపిన ప్రయోగాల్లో వెల్లడైంది. దీంతో మే 17నుంచి భారత్‌లో ఉత్పత్తిని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభించింది. అనంతరం భారత్‌లో అత్యవసర వినియోగానికి అదే నెలలో కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. అయినప్పటికీ అత్యవసర వినియోగానికి ఇంకా అనుమతి రాలేదు. మరోవైపు దాదాపు కోటి డోసులకు వినియోగ గడువు డిసెంబర్‌ నాటికే ముగుస్తున్న నేపథ్యంలోనే కొవొవాక్స్‌ను ఎగుమతికి అనుమతి ఇవ్వాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ కేంద్రాన్ని కోరింది. సమీక్షించిన ప్రభుత్వం ఇండోనేసియాకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో దాదాపు 5కోట్ల డోసులు కలిగిన 50లక్షల వయల్స్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఇండోనేసియాకు అందించనుంది.

ఇదిలాఉంటే, అమెరికాకు చెందిన నొవావాక్స్‌ అభివృద్ధి చేసిన ఈ టీకా కొవిడ్‌ను నిరోధించడంలో 90శాతం సమర్థత కలిగినట్లు ప్రయోగాల్లో వెల్లడైంది. ఓ మోస్తారు నుంచి తీవ్ర లక్షణాలున్న కేసుల్లో వైరస్‌ను వందశాతం ఎదుర్కొంటున్నట్లు తేలింది. అమెరికా, మెక్సికోలో దాదాపు 30వేల మందిపై జరిపిన ప్రయోగాల్లో ఈ ఫలితాలు వచ్చాయి. దీంతో వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో నొవావాక్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ దాదాపు 110కోట్ల డోసులను తయారు చేయనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు