Vaccine: కరోనా టీకాలు.. మళ్లీ ఎగుమతి దేశాల జాబితాలోకి భారత్..!

భారత్‌లో కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. ఉత్పత్తిని పెంచడంతో నిల్వల్ని చూపగలుగుతోంది. దేశవ్యాప్తంగా 22.45 కోట్లకు పైగా టీకా డోసులు నిల్వ ఉన్నాయని గురువారం కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. మిగులు డోసులు ఉండటంతో టీకా ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Published : 19 Nov 2021 19:06 IST

మిగులు డోసుల నేపథ్యంలో త్వరలో కేంద్రం నిర్ణయం

దిల్లీ: భారత్‌లో కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. ఉత్పత్తిని పెంచడంతో నిల్వల్ని చూపగలుగుతోంది. దేశవ్యాప్తంగా 22.45 కోట్లకు పైగా టీకా డోసులు నిల్వ ఉన్నాయని గురువారం కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. మిగులు డోసులు ఉండటంతో టీకా వాణిజ్యపర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

‘నవంబర్‌ నెలలో దాదాపు 31 కోట్ల డోసుల్ని డెలివరీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 20 నుంచి 22 కోట్ల డోసుల కంటే ఎక్కువ పంపిణీ చేస్తాయనుకోవడం లేదు. మిగిలిన వాటిని ఎగుమతి చేస్తాం’ అని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. డిసెంబర్‌ నాటికి నిల్వ డోసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మరోపక్క కొవాక్స్‌ కార్యక్రమానికి  కోటి డోసులు ఎగుమతి చేసేందుకు ఇప్పటికే సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. భారత్  మార్చి 25 వరకు కొవాక్స్‌కు 28 మిలియన్ల డోసుల్ని సరఫరా చేసింది. అదే నెలల మరో 28 మిలియన్ల డోసులు, ఏప్రిల్ నెలలో 50 మిలియన్ల డోసుల్ని ఎగుమతి చేయాలని భావించింది. అయితే ఆ సమయంలో భారత్‌ కరోనా రెండో వేవ్‌  కోరల్లో చిక్కుకుపోయింది. దాంతో టీకా డోసుల ఎగుమతి నిలిచిపోయింది. ప్రస్తుతం దేశంలో వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. మరోపక్క కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతులు వచ్చాయి. దాంతో కొవాగ్జిన్ టీకాలను కూడా ఇతర దేశాలకు సరఫరా చేయనున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. అలాగే వాణిజ్యపరంగా టీకా ఎగుమతిపై కూడా యోచిస్తున్నట్లు చెప్పారు. 

ఇంకోపక్క బయోలాజికల్-ఇ టీకా కార్బివ్యాక్స్‌ కూడా డిసెంబర్‌లో అత్యవసర వినియోగ అనుమతులు పొందే అవకాశం ఉంది. అయితే ఈ టీకాలను ఇతర దేశాల సరఫరాకే వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా 82 శాతం మంది మొదటి డోసు, 42 శాతం మంది రెండో డోసు వేయించుకునున్నారు. అంటే కనీసం 82 శాతం మంది కార్బివ్యాక్స్‌ను వేయించుకునే వీలులేదు. ‘ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు టీకా డోసుల కోసం వేచి చూస్తున్నాయి. సుమారు 195 దేశాల్లో 40 దేశాలు మాత్రమే 75 శాతం టీకా డోసుల్ని అందించగలిగాయి. మిగిలిన 150 దేశాలు 30 శాతం మాత్రమే వేయగలిగాయి’ అని కార్బివ్యాక్స్ గురించి అడిగిన ప్రశ్నకు ఆ అధికారి సమాధానం ఇచ్చారు .

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని