Omicron Scare: ఒమిక్రాన్ గుప్పిట్లో ప్రపంచం.. రికార్డు కేసులతో ఐరోపా దేశాలు విలవిల..!

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని చుట్టుముట్టింది. దేశాలన్నీ ఆంక్షల ఛట్రంలోకి వెళ్లినప్పటికీ.. ఆ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది.

Published : 29 Dec 2021 16:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని చుట్టుముట్టింది. దేశాలన్నీ ఆంక్షల చట్రంలోకి వెళ్లినప్పటికీ.. ఆ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వరుసగా రెండోరోజు 10లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఐరోపా రికార్డు కేసులతో సతమతమవుతోంది. ఫ్రాన్స్‌లో మునుపెన్నడూ లేని విధంగా 1,79,807 కేసులు వెలుగుచూశాయి. క్రిస్మస్ కారణంగా ముందురోజుల్లోని కేసులను చూపడం వల్ల ఈ సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే జనవరి ప్రారంభంలో ఒక్కరోజే 2,50,000 కేసులు రావొచ్చని అక్కడి ఆరోగ్యమంత్రి ఇదివరకే హెచ్చరించారు. మరింత క్లిష్టమైన రోజులు ముందున్నాయని అక్కడి వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ ఫ్రాన్స్‌తో పాటు ఇటలీ, గ్రీస్‌, పోర్చుగల్, ఇంగ్లండ్‌లో కూడా రికార్డు స్థాయిలో కేసులు బయటపడ్డాయి. 

బ్రిటన్‌లో అప్పుడు కఠినఆంక్షలు తప్పవు..

బ్రిటన్‌లో 1,29,471 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడికి చేయడానికి కొత్త ఆంక్షలు తీసుకురావడం లేదని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించిన మరుసటి రోజే ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ప్రజలంతా కొవిడ్ నియమావళిని పాటిస్తూ.. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకాలని బ్రిటన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఒకవేళ వైద్య వ్యవస్థ కుప్ప కూలిపోయేదశకు చేరుకుంటే.. ఆంక్షలను కఠినతరం చేస్తామని హెచ్చరించింది. ఇప్పటివరకు డిసెంబర్ 24న అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఆ సంఖ్య 1,22,186గా ఉంది. 

అమెరికాలో 58.6 శాతం ఒమిక్రాన్ కేసులే..

సీడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. కరోనా కొత్త కేసుల్లో 58.6 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్ కేసులే ఉన్నాయి. డిసెంబర్ 25 వరకు గణాంకాలను పరిగణలోకి తీసుకొని సీడీసీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంకోవైపు అమెరికాలో రికార్డు స్థాయిలో 4,41,278 కేసులు బయటపడ్డాయి. ఆ దేశంలో కరోనా అడుగుపెట్టినదగ్గరి నుంచి ఇవే అత్యధిక కేసులు. అలాగే అక్కడ ఐసోలేషన్, క్వారంటైన్ సమయాన్ని 10 రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయం అమెరికన్లలో గందరగోళాన్ని సృష్టిస్తుందని నిపుణులు అంటున్నారు. కరోనా నెగెటివ్‌ వచ్చిందో, లేదో పట్టించుకోకుండా ప్రజలు ఐసోలేషన్‌ నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని దేశాలతో కలుపుకొని కరోనా కొత్త కేసులు 10 లక్షల మార్కు దాటడంపై స్పందించింది. ఒమిక్రాన్‌తో తీవ్ర ముప్పు పొంచి ఉందని, వైద్య వ్యవస్థలను ముంచెత్తుతుందని హెచ్చరించింది. వ్యాప్తిని నివారించేందుకు కఠినచర్యలు చేపట్టాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని