West Europe: పశ్చిమ ఐరోపా అతలాకుతలం

పశ్చిమ ఐరోపాలో వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా జర్మనీ, బెల్జియంలో

Published : 18 Jul 2021 11:22 IST

168కి చేరిన వరద మృతులు

బెర్లిన్‌: పశ్చిమ ఐరోపాలో వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా జర్మనీ, బెల్జియంలో శనివారం నాటికి 168 మంది మృతిచెందారు. జర్మనీలోని అహర్విలర్‌ కౌంటీ, నార్త్‌ రైన్‌- వెస్ట్‌ ఫాలియా రాష్ట్రాల్లోనే 141 మందికి పైగా మృతిచెందగా, బెల్జియంలో 27 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి అధికారులు ప్రకటించారు. గల్లంతైన వందలాది మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నీటి ప్రవాహానికి అనేక ఇళ్లు కూలిపోయాయి. కార్లు, ట్రక్కులు కాగితం పడవల్లా కొట్టుకుపోయాయి. వీటిలో మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి వాహనాల్ని తొలగించేందుకు జర్మనీలో సైన్యం రంగంలోకి దిగింది. గత వారం అంతా ఏకధాటిగా కురిసిన వర్షాలు ఎట్టకేలకు శాంతించడంతో శనివారం నాటికి వరద నీరు క్రమంగా తగ్గుతోంది. జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌ - వాల్టర్‌ స్టెయిన్మీర్‌.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. చాలా మంది తమ సర్వస్వం కోల్పోయారని, ఎవరినీ నిరాశ పరచకుండా అన్నివిధాలా ఆదుకుంటున్నామన్నారు. వ్యర్థాలు, అడ్డంకులు తొలగించేందుకే వారాలు పడుతుందని, ఆ తర్వాతే ఎంతమేర నష్టం జరిగిందో అంచనా వేయగలమని ఆయన చెప్పారు. మరోవైపు తీవ్రంగా దెబ్బతిన్న అహర్విలర్‌ ప్రాంతాన్ని చూసేందుకు పెద్దఎత్తున సందర్శకులు వస్తుండటం పోలీసులకు తలనొప్పిగా మారింది.

నీటిలో పడిపోయిన విద్యుత్తు లైన్లతో ప్రమాదం పొంచి ఉందని, ఎవరూ రావొద్దంటూ హెచ్చరికలు చేస్తున్నారు. వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణంపై చర్చించేందుకు జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ వచ్చే బుధవారం కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. తూర్పు బెల్జియంలో సరిహద్దు వెంబడి రైల్వే ట్రాకులు, రహదారులన్నీ నీట మునిగాయి. రాజు ఫిలిప్, రాణి మాథిల్డే శుక్రవారం ఆయా ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. నెదర్లాండ్స్‌లోని దక్షిణ భాగంలో పలు ప్రాంతాలు వరదలతో దెబ్బతిన్నాయి. ఇక్కడ వాలంటీర్లు పెద్దఎత్తున సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. స్విట్జర్లాండ్‌లో భారీ వర్షాలకు పలు నదుల గట్లు తెగిపోయాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని